flydubai : ఫ్లైదుబాయ్ సంస్థకు చెందిన విమానంలో జరిగిన ఘటన సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. పైలట్‌పై కో పైలట్ దాడి చేయడంతో ఆ పైలట్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే, ఈ ఘటనలో గాయాలపాలైన పైలట్ భారతీయుడు అని తెలుస్తోంది. భారతీయుడైన కెప్టెన్ అప్రమత్తత వల్లే విమానంలోని ప్రయాణికుల ప్రాణాలు నిలిచాయని ఇజ్రాయెల్ మీడియా చెబుతోంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలివి.
ఫ్లైదుబాయ్ సంస్థకు చెందిన విమానం దుబాయ్ నుంచి బయల్దేరిన రెండున్నర గంటల తర్వాత కాక్‌పిట్‌లో పైలట్, కో పైలట్ మధ్య ఘర్షణ తలెత్తింది. ఒమన్ దేశానికి చెందని కో పైలట్ విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడు. అంటే, సెప్టెంబర్ 11, 2001లో అమెరికాలోని ట్రేడ్ సెంటర్‌పై జరిగిన విమాన దాడిలాగా.. విమానాన్ని కూల్చేందుకు కో పైలట్ ప్రయత్నించాడు. ఈ ప్రయత్నాన్ని ఇండియన్ కెప్టెన్ అయిన పైలట్ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో పైలట్, కో పైలట్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇండియన్ కెప్టెన్ అయిన పైలట్‌పై కో పైలట్ కత్తితో దాడి చేశాడు.
అతడిని పలుమార్లు పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. కాక్‌పిట్‌లో రక్తపు మరకలే ఉన్నాయి. ఈ ఘటనలో కో పైలట్ కూడా గాయపడ్డాడు. అయితే, అక్కడే ఆఫ్ డ్యూటీలో ఉన్న పైలట్లు ఇద్దరు విమానాన్ని నడిపారు. సురక్షితంగా సౌదీలోటి టబుక్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఇండియన్ కెప్టెన్ అయిన పైలట్ ప్రాణాలతో తెగించి పోరాడటం వల్లే విమానంలోని 180 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. అయితే, ఈ విషయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
దీనిపై అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఈ ఘటనలో గాయపడి, అందరినీ రక్షించింది భారతీయుడేనే అనే విషయం తేలాలి. మరోవైపు ఈ ఘటనలో ఉగ్ర కుట్ర కోణం ఉన్నట్లు ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. ఉగ్ర దాడి కోణం వల్లే కో పైలట్ విమానాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.