వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం ఆదివారం నీట్ నిర్వహించగా, మూడు నిమిషాలు ఆలస్యం కావడంతో ఇద్దరు అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ఉండగా, నిబంధనల ప్రకారం అధికారులు 1:30 గంటలకే గేట్లు మూసివేయగా, పలువురు అభ్యర్థులు టైంకు సెంటర్లకు చేరుకోలేకపోయారు. దాంతో ‘ప్లీజ్ సార్. మమ్మల్ని అనుమతించండి’ అంటూ వేడుకున్నారు.
కరీంనగర్ కమాన్‌చౌరస్తా, మే 4 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన వైష్ణవి ఆమె తల్లితో కలిసి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాలలోని సెంటర్‌కు బస్సులో వచ్చింది. అయితే మూడు నిమిషాలు ఆలస్యంగా హాజరుకాగా, అప్పటికే అధికారులు గేటు మూసివేశారు. ‘సారు ఒకసారి అవకాశమివ్వండి. కూలీ నాలీ చేసి నా కూతురిని చదివించిన. ఒంటిమీద బంగారం అమ్మి 1.50 లక్షల ఫీజు, హాస్టల్ ఫీజు చెల్లించి లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పించిన. బస్సు ఆలస్యంతో లేటైంది సారు. ప్లీజ్ సార్ గేటును తెరవండి. నా కూతురుకు న్యాయం చేయండి’ అంటూ విద్యార్థిని తల్లి ఎంత ప్రాధేయపడినా అనుమతించలేదు. చేసేదేంలేక తల్లీబిడ్డలు రోదిస్తూ వెనుదిరిగారు.
కొడిమ్యాల, మే 4 : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వీవీరావుపేటకు చెందిన సీహెచ్ నవ్య గతేడాది లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకొని అప్పుడు నీట్ రాయగా ఆశించిన ఫలితం రాలేదు. ఈ యేడాది ఇంట్లోనే ఉండి చదువుకున్నది. ఆదివారం నీట్ ఎగ్జామ్ ఉండగా, తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో 11:40 గంటలకు బయలుదేరింది. జగిత్యాలలోనే పరీక్ష అనుకొని ఒంటిగంట వరకు చేరుకున్నది. అయితే హాల్ టికెట్ చూడగా నాచుపల్లి జేఎన్టీయూ అని ఉండడంతో వెంటనే బయలు దేరింది. అయితే రూట్ తెలియకపోవడం, స్థానికుల సమాచారంతో తికమకపడడంతో మూడు నిమిషాలు ఆలస్యంగా 1:33 గంటలకు సెంటర్‌కు చేరుకున్నది. కానీ, పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో కంటతడి పెట్టింది.