Vageshwari College | తిమ్మాపూర్, మార్చి23: తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలో గల వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ గుర్తింపు లభించినట్లు కళాశాల జనరల్ సెక్రెటరీ గండ్ర శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కళాశాలలో సోమవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. జనవరిలో అధికారుల బృందం కళాశాలలో తనిఖీలు నిర్వహించారని, అధికారుల బృందా నివేదిక ఆధారంగా కళాశాలలో బీటెక్ సీఎస్సీ, ఈసీఈ, ఈఈఈ మూడు కోర్సులకు మూడేళ్ల పరిమితితో నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ గుర్తింపు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సహకరించిన కళాశాల అధ్యాపకులకు, విద్యార్థులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కళాశాల ఆవరణలో కేకు కట్చేసి వేడుకలు నిర్వహించారు. ఈ గుర్తింపు కళాశాలకు గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రెటరీ దావు శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు వినోద్, ప్రకాష్ రెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనివాస్, విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.