Pakistan : పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (పీవోజేకే)లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు నెలలుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనల్ని అణిచివేయడానికి పాక్ ప్రభుత్వం అత్యంత కఠినంగా, అమానవీయంగా వ్యవహరిస్తోంది. రావల్కోట్లో నిరసనకారులపై పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో నాలుగు రోజుల్లోనే 42 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. అయితే, ఈ అణిచివేతపై భారత ప్రభుత్వం స్పందించింది. పాక్ ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించింది.
శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సామాన్య ప్రజలపై నిర్దాక్షిణ్యంగా బలగాల్ని ప్రయోగించడం సరికాదని భారత్ వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ప్రపంచం స్పందించాలని, పాక్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని కోరింది. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ఒక ప్రకటన చేశారు. ‘‘పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సామాన్య ప్రజలపై పాక్ ప్రభుత్వం దారుణంగా బలగాల్ని ప్రయోగిస్తోంది. పాక్ చర్య వల్ల ఇప్పటికే 40 మంది మరణించడం విచారకరం. ఇంకా ఎందరో తీవ్రంగా గాయపడ్డారు. పాక్ అసహ్యమైన చర్యకు పాల్పడింది. సాధారణ ప్రజల్ని శతృవులుగా వర్ణించడం సరికాదు. ఒకప్పుడు ఉగ్రవాదులకు శిక్షణ, ఆయుధాలు, నిధులు ఇచ్చిన పాక్ ప్రభుత్వం ఇప్పుడు సొంత దేశానికే వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది.
పీవోజేకేలో నిర్వహించబోయే ఎన్నికలు పాకిస్తాన్ హింసాత్మక ధోరణికి వ్యతిరేకంగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం కూడా పాకిస్తాన్ చర్యలపై స్పందించాలి. పాక్ ప్రభుత్వాన్ని జవాబుదారిగా చూపాలి’’ అని జైశ్వాల్ అన్నారు. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీవోజేకేలో చేపట్టిన ఆందోళనలు 51వ రోజులకు చేరుకున్నాయి. ఆందోళనకారులపై పాక్ బలగాలు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుండటంతో వందలాది మంది ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో ఆగష్టు 2న జరగబోయే ఎన్నికలను స్థానికులు బహిష్కరించారు.