AITUC | కోరుట్ల, నవంబర్ 28: ఆల్ ఇండియా బీడీ సిగార్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సమావేశాలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సుతారీ రాములు, భారతల గోవర్ధన్ పేర్కొన్నారు. పట్టణంలోని సీ ప్రభాకర్ భవనంలో శుక్రవారం బీడీ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 29, 30 తేదీల్లో వేములవాడలో ఆల్ ఇండియా బీడీ సీగర్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
బస్టాండ్ నుంచి బహిరంగ స్థలం వరకు జరిగే ర్యాలీలో బీడీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బీడీ కార్మికులకు 1000 బీడీలకు రూ. 300 కూలి అందించాలని, 26 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు. సభలో గ్రాటివిటీ చట్టం ప్రకారం డబ్బులు చెల్లించాలని, కాంట్రాక్టు పద్ధతి రద్దు చేయాలని, బీడీ కార్మికులకు కనీస పెన్షన్ రూ.వెయ్యి నుంచి రూ. 5000 కు పెంచాలని తదితర డిమాండ్ల సాధన కోసం ఈ జాతీయ కౌన్సిల్లో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలిపారు. సమావేశంలో బీడీ కార్మిక సంఘం నాయకులు మౌలానా, ముక్రం తదితరులు పాల్గొన్నారు.