మత్తులో చిత్తవుతూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న జమ్మికుంటలో పలువురు యువతపై కీలకమైన ‘నార్కోటిక్స్’ నిఘా పెట్టింది. గంజాయి, డ్రగ్స్, తదితర మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారనే ఆరోపణలు.. కట్టడి చేయాలంటూ ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదుల నేపథ్యంలో రంగంలోకి దిగినట్లు తెలిసింది. సదరు అధికారుల బృందం పట్టణంతో పాటు మండలంలోని ఓ గ్రామంలోని కొందరు యువకుల పనితీరు, వ్యవహారశైలిపై ఆరా తీయడమేకాదు, పలువురికి కౌన్సెలింగ్ ఇస్తూ.. ‘మత్తు’ పదార్థాల దందాపై హెచ్చరికలు జారీ చేసినట్లు ప్రచారం సాగుతున్నది. కొందరి ఫోన్ నంబర్లతో పాటూ కాల్‌డేటా, తదితర టెక్నికల్ అంశాలపై ఫోకస్ పెట్టి కూపీ లాగుతున్నట్లు తెలుస్తుండగా, సర్వత్రా కలకలం రేపుతున్నది.
– జమ్మికుంట, మే30
జమ్మికుంట, మే30: యువత మత్తు వలయంలో చిక్కుకున్నదా..?, అడ్డూఅదుపులేకుండా వ్యవహరిస్తున్నదా..? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకు కారణాలు కూడా అనేకంగా ఉన్నాయని తెలుస్తున్నది. మున్సిపల్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన యువకులు కొందరు గంజాయి, డ్రగ్స్‌ను వాడుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతున్నది. డబ్బు, పలుకుబడి ఎక్కువగా ఉండడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనికి తోడు అధికారులెవరూ పట్టించుకోకపోవడం సదరు యువకులకు మరింత బలం చేకూరినట్లయింది. ఒకానొక దశలో అధికారులను తిడుతూ, దాడులు చేసే వరకు వెళ్లిందనే ప్రచారం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే మండలంలోని మరో గ్రామంలో ఓ బ్యాచ్ సంచారం అక్కడి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నదని తెలిసింది. దొంగతనాలు, మహిళల పట్ల అసభ్య ప్రవర్తన చేస్తున్నట్లు తెలుస్తుండగా, ఈ విషయం ఠాణా వరకు వెళ్లకుండా ఓ వర్గం అడ్డుకుంటున్నట్లు సమాచారం. ఎక్కడికక్కడే సెటిల్మెంట్ చేయడం, ఈ క్రమంలో శాంతిభద్రతలు అదుపుతప్పే పరిస్థితులు నెలకొన్నాయని చర్చ సాగుతున్నది. ఇంత జరుగుతున్నా ఆ గ్రామ అధికారులు, సిబ్బంది ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నలా ఉంది.
‘మత్తు’కు బానిసైన యువత నేరాలు చేసే దిశగా సాగుతున్నదని, మాదకద్రవ్యాలను కట్టడి చేస్తూ, యువతను సన్మార్గంలో పెట్టాలని కోరుతూ ఇటీవల సామాజిక కార్యకర్త శ్రీకాంత్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదుల నేపథ్యమో లేక అధికారులకున్న సమాచారమో తెలియదు కానీ, జమ్మికుంటలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలపై నార్కోటిక్స్ టీం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. అంతేకాకుండా వెంటనే రంగంలో దిగినట్లు సమాచారం. ఇక్కడి యువత గంజాయి, డ్రగ్స్, తదితర మత్తు పదార్థాలు తీసుకుంటున్నదా..? తీసుకుంటే.. ఎక్కడి నుంచి సరఫరా జరుగుతున్నది..? ఎవరి ప్రమేయం ఎంత..? అనే అంశాలపై అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. పలువురు యువకుల పేర్లు సేకరించి, వారిపై నిఘా పెట్టినట్లు వినికిడి. ఏది ఏమైనా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని, నార్కో అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తులున్నాయి.