కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన మొదటి విడుత రుణమాఫీలో లక్షలాది మంది రైతుల పేర్లు గల్లంతయినట్టు తెలుస్తున్నది. చాలా బ్యాంకులు, సహకార సంఘాల పరిధిలో నలభై నుంచి యాభైశాతం మందికి వర్తించనట్టు వెలుగులోకి వస్తున్నది. ఒకరిద్దరు కాదు.. కొన్ని లక్షల మందికే అన్యాయం జరిగినట్టు సమాచారం అందుతున్నది. జాబితాలో లేని రైతులకు రుణమాఫీ జరుగుతుందా..? లేదా..? అన్నదానిపై ఎవరూ స్పష్టత నివ్వడం లేదు. అర్హుల వివరాలు ప్రభుత్వానికి పంపిస్తున్నామని, రెండు మూడు రోజలు ఓపిక పట్టాలని బ్యాంకర్లు సర్దిచెబుతున్నారే తప్ప.. ఏ అధికారినుంచి సరైన సమాధానం దొరకడం లేదు. అసలు ఏ నిబంధనల ప్రకారం రుణమాఫీ చేశారో ఇప్పటి వరకు ఎవరూ చెప్పడం లేదు. మరోవైపు మాఫీ జాబితాను శుక్రవారం సైతం పంచాయతీల్లో ప్రదర్శించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతుండగా, ఆశగా ఎదురు చూసిన రైతులందరికీ నిరాశే మిగులుతున్నది.
కరీంనగర్, జూలై 19 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : రూ.లక్ష వరకు పంట రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు రైతుల ఖాతాలకు నిధులు జమ చేస్తున్నట్టు వెల్లడించింది. అయితే రుణమాఫీ లబ్ధిదారుల జాబితాను బుధవారమే ప్రకటించింది. ఆ తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ గురువారం మరో జాబితా ఇచ్చింది. గురువారం రాత్రి వరకు మళ్లీ పూర్తి వివరాలు ఇస్తామని, ముందుగా వచ్చిన జాబితాలో మిస్సైన పేర్లు తదుపరి జాబితాలో వస్తాయని అధికారులు సైతం వివిధ గ్రూపుల్లో వాయిస్ పెట్టారు. కానీ, ఆ తరహా ఏమీ జరగడం లేదు. ముందుగా ఇచ్చిన జాబితాలోని వారికే మాత్రమే రుణమాఫీ జరిగినట్లుగా బ్యాంకర్లు చెబుతున్నారు. దీని ప్రకారం చూస్తే.. లక్ష వరకు ఉమ్మడి జిల్లాలో 1,24,167 మందికి మాత్రమే రుణమాఫీ వర్తించింది. మొత్తం 688.42 కోట్లు మాఫీ జరిగింది. ఈ డబ్బులు ఇప్పుడిప్పుడే బ్యాంకులకు చేరుతున్నాయి. అయితే ఏ గ్రామానికి వెళ్లినా.. సగం మందికి వస్తే సగం మందికి రుణమాఫీ జరగలేదు. కొన్ని గ్రామాల్లో అయితే రుణమాఫీ అయిన రైతుల సంఖ్య వేళ్లపై లెక్కపెట్టే రీతిలో ఉంది. బ్యాంకులు, సహకార సంఘాల పరిస్థితి అలాగే ఉంది. ఒకటి రెండు కాదు, ప్రతి బ్యాంకు, ప్రతి సహకార సంఘంలోనూ ఇదే పరిస్థితి.
ఈ లెక్కన చూస్తే ఉమ్మడి జిల్లాలో లక్షల మంది పేర్లు గల్లంతయ్యాయి. నిజానికి 2014లో కేసీఆర్ ప్రభుత్వం మొదటిసారి లక్ష వరకు రుణమాఫీ చేసింది. అప్పుడు 3,77,984 మంది రైతులకు సంబంధించిన 1,693.52కోట్లు మాఫీ చేసింది అలాగే తిరిగి రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు.. లక్ష మాఫీ చేస్తామని ప్రకటించి దశల వారీగా అమలు చేసింది. ఆ లెక్కన చూస్తే రెండో సారి సైతం 3,73,213 మందికి 1,191కోట్లు మాఫీ చేసి మాట నిలబెట్టుకున్నది. నిజానికి 2018 నుంచి 2023 డిసెంబర్ అంటే.. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్ఎస్ పాలన కాలంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రైతుల సంఖ్య కూడా పెరిగింది. ఒక అంచనా ప్రకారం చూస్తే.. 2 లక్షలలోపు రుణం తీసుకున్న వారి సంఖ్య దాదాపు 5 లక్షల వరకు, అందులో లక్షలోపు రుణం తీసుకున్న రైతుల సంఖ్య మూడు లక్షల వరకు ఉంటుంది. జిల్లాలో పెద్ద రైతులకన్నా చిన్న తరహా రైతుల సంఖ్యే ఎక్కువ. ఆ లెక్కన లక్షలోపు రుణం తీసుకున్న రైతులే అధికం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిన వారి సంఖ్య చూస్తే కేవలం 1.24 లక్షలు మాత్రమే ఉన్నది. ఈ లెక్కన చూస్తే దాదాపు లక్ష నుంచి లక్షాయాభైవేల మంది రైతుల పేర్లు గల్లంతైనట్టు తెలుస్తున్నది.
నిజానికి రుణమాఫీకి సంబంధించి ముందుగా కొన్ని విధివిధానాలను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ నిబంధనలు అమలు చేస్తామని చెప్పింది. అవి అమలు చేసినా ఉమ్మడి జిల్లాలో 2.42 లక్షల పై చిలుకు రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉన్నది. ఎందుకంటే తాజాగా ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ కింద కేంద్రం నిధులు విడుదల చేసిన ఉమ్మడి జిల్లా రైతుల సంఖ్య 2.42 లక్షల పైచిలుకు ఉన్నది. చాలామంది రైతులకు ఐటీ రిటర్న్ లేకున్నా రుణమాఫీ అమలు చేయలేదు. 30వేల క్రాప్‌లోన్ తీసుకున్న రైతులకు కూడా వర్తించలేదు. దీని పై ఎవరికీ స్పష్టత లేదు. అధికారులను ప్రశ్నిస్తే.. అంతా హైదరాబాద్ నుంచే జరుగుతున్నదని, మాకేమి తెలియదని సమాధానం చెబుతున్నారు. బ్యాంకర్లు కూడా చెప్పేది అదే. చివరకు లీడ్‌బ్యాంకు అధికారుల జవాబు అదే. ఇదిలా ఉంటే ఆహారభద్రత కా ర్డును పరిగణలోకి తీసుకున్నారా..? అంటే దానిపైనా స్పష్టత లేదు. అసలు రుణమా ఫీ అర్హుల జాబితా ఏ ప్రాతిపదికన తయారు చేశారన్న దానిపైనా ఎవరికీ క్లారిటీ లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీ పొందిన రైతుల జాబితాను చాలా చోట్ల ప్రదర్శించకపోవడంతో జాబితాలో తమ పేరు ఉందో లేదోనని ఆరా తీస్తున్నారు. శుక్రవారం చాలా మంది తమకు రుణమాఫీ వర్తించిందా..? లేదా..? తెలుసుకోవడానికి బ్యాంకులు, సహకార సంఘాలకు బారులు తీరారు. అయితే వచ్చిన రైతులకు ఏమి చెప్పాలో తెలియక, రుణమాఫీ రాని వివరాలు ప్రభుత్వానికి పంపించామని, రెండు మూడు రోజులు ఓపిక పట్టాలని సర్ది చెబుతున్నారు. దీంతో రైతులు తమ ఆగ్రహాన్ని, ఆవేదనను లోలోనే అణుచుకొని నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇప్పటికైనా రుణమాఫీ ఏ ప్రాతిపదికన చేశారు? అర్హుల పేర్లు ఎందుకు మిస్ అయ్యా యి? మిస్సైన వారికి తిరిగి రుణమాఫీ వర్తింప జేస్తూ ఉత్తర్వులు ఇస్తారా..? లేదా..? అన్నదానిపై ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
నేను రూ.61 వేల క్రాప్ లోన్ తీసుకున్న. మాఫీ అయితయని చెప్పిన్రు. బ్యాంకు అధికారులను అడిగితే ఇంకా రాలేదన్నరు. అత్తదో రాదో తెల్వదు. కేసీఆర్ ప్రభుత్వంలో రూ.54 వేలు తీసుకున్న. అవి మొత్తం అప్పుడే మాఫీ చేసిండ్రు. మాఫీ అంటే అందరికీ ఒక్కటే రూలు ఉండాలె గానీ, కొంత మందికి జరిగి కొంత మందికి రాకపోవడం ఏంది? ఎందుకు రాలేదని అడిగితే.. మాకు తెలియదంటున్నరే తప్ప. ఎవరూ చెప్తలేరు.
ఇతడి పేరు పుట్టపాక దేవయ్య. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇప్పల్ నర్సింగాపూర్. ఇతడికి గ్రామంలో రెండెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. దేవయ్య హుజూరాబాద్ సింగిల్‌విండోలో భూమి తనఖా పెట్టి గతేడాది జూలై 17న 87 వేల క్రాప్ లోన్ తీసుకున్నాడు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్యన తీసుకున్న రుణం 2 లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రకటించి, లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తున్నట్టు ఒక జాబితా విడుదల చేసింది. అయితే అందులో దేవయ్య పేరు లేదు. దీంతో ఆయన స్థానిక సింగిల్‌విండో కార్యాలయానికి వెళ్లి అప్పు మాఫీ విషయం అడిగితే.. సరైన సమాధానం లేక వెనుదిరిగాడు. ఒక్క దేవయ్యే కాదు, హుజూరాబాద్ సింగిల్‌విండో పరిధిలోనే సుమారు 200 మంది రైతులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. మొత్తం 971 మంది రైతులు అప్పు తీసుకోగా, లక్ష వరకు లోన్ తీసుకున్న రైతులు 577 మంది ఉన్నారు. అందులో కేవలం 377 మంది రైతులకు మాత్రమే రుణంమాఫీ జరగ్గా, మిగతా రైతులు తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
దుర్శేడ్ కో ఆపరేటివ్ బ్యాంకుల నేను రూ.80 వేల క్రాప్ లోను తీసుకున్న. ఇప్పటి వరకు మాఫీ కాలే. నిన్నటి నుంచే ఎదిరి చూస్తున్న. నిన్న అడిగితే.. రేపు రమ్మన్నరు. ఇవ్వాళ్ల అడిగితే.. తరువాత వస్తది అని చెబుతున్నరు. అంతా మాయలెక్క ఉన్నది. అసలు ఏం జరుగుతుందో.. రుణమాఫీ ఎట్ల జేసిండ్రో అర్థం కావడం లేదు.