‘చొప్పదండి నియోజకవర్గానికి ఎందరెందరో ఎమ్మెల్యేలుగా పని చేశారు. అందులో కొందరు మంత్రులుగా కూడా పనిచేశారు. కానీ, ఏ ఒక్కరు ఈ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో ఈ ప్రాంత ముఖచిత్రాన్నే మార్చేశారు. ఆయన ఇచ్చిన వందలాది కోట్లతో ఈ రోజు చొప్పదండిని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాం. ప్రజలే నా దేవుళ్లు. వాళ్ల మధ్యనే ఉంటున్నా. కేసీఆర్ ఆశీర్వాదంతో నా ఊపిరి ఉన్నంత వరకు సేవలు అందిస్తా. కేసీఆర్‌కు నాపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. నా ప్రచారాస్త్రం ఒక్కటే కేసీఆర్ సారే. ఆయన పేరు చెప్పుకొనే ఓట్లు అడుగుతా. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతా’ అని తాజా చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 1,600 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, గతంలో ఏ ఎమ్మెల్యే ఈ రకంగా పనులు చేయలేదని చెప్పారు. ఇంకా ఆయాన మాటల్లోనే..
నమస్తే : మీ నియోజకవర్గంలో మీరు సాధించిన చెప్పుకోదగిన పనులు?
ఎమ్మెల్యే సుంకె : చాలా ఉన్నాయి. చొప్పదండి చరిత్రలో ఏండ్ల తరబడిగా పేరుకుపోయిన అనేక సమస్యలు పరిష్కరించుకున్నాం. వందల కోట్ల నిధులిచ్చి సీఎం కేసీఆర్ ఈ నియోజకవర్గ ముఖచిత్రాన్నే మార్చేశారు. చెప్పుకోవాలంటే నియోజకవర్గ కేంద్రాన్ని గతంలో ఏ ఎమ్మెల్యే పట్టించుకోలేదు. గ్రామ పంచాయతీగా ఉన్న చొప్పదండిని మున్సిపాలిటీగా మార్చుకున్నాం. 120 కోట్లతో పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. 100 పడకల దవాఖాన మంజూరు చేసుకున్నాం. అద్భుతమైన రోడ్లు వేసుకుంటున్నాం. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. నియోజకవర్గంలో చూస్తే 52 పల్లె దవాఖానలు, 2 బస్తీ దవాఖానలు తెచ్చుకున్నాం. 52 పంచాయతీలకు కొత్త భవనాలు నిర్మించుకున్నాం. 248 కోట్లతో వరద కాలువకు నాలుగు ఓటీలను ఏర్పాటు చేసుకొని, 30 వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నాం. సీఎం కేసీఆర్ దయతో ఈ పనులు మంజూరయ్యాయి. సీఎం కేసీఆర్ కొండగట్టును సందర్శించి 100 కోట్లు ఇచ్చారు. ఈ పనులు నడుస్తున్నాయి. మరో 500 కోట్లు కూడా ఇచ్చారు. ఈ పనులకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. గ్రామాల మధ్య బీటీ రోడ్లు, గ్రామాల్లో అంతర్గతంగా నిర్మించే సీసీ రోడ్లు ప్రతి గ్రామంలో చేపట్టాం. నియోజకవర్గంలో వ్యవసాయం, విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చి పనులు చేపడుతున్నాం.
అభివృద్ధికి ఇప్పటి వరకు ఎన్ని కోట్లు తెచ్చారు?
సుంకె : ఒకప్పుడు నియోజకవర్గంలో అభివృద్ధి అంటే తెలియదు. పెద్ద పెద్ద నాయకులు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. మంత్రులు కూడా అయ్యారు. టీ జీవన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎక్కడా ఒక తట్టెడు మట్టి తీసిన పాపన పోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చొప్పదండి ప్రజలకు అభివృద్ధి అంటే ఏమిటో తెలిసి వచ్చింది. నిరంతరం అభివృద్ధి కోసం తపిస్తూనే ఉన్నా. గడిచిన ఈ ఐదేళ్లలో సుమారు 1,600 కోట్ల నిధులతో అభివృద్ధి చేశా. అందుకు సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్ నాకు ఎంతో సహకారం, ప్రోత్సాహం అందించారు.
మీ గెలుపునకు సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఏ విధంగా దోహదపడతాయని భావిస్తున్నారు?
సుంకె : కేసీఆర్ పథకాలే ఈ రోజు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపునకు దోహదపడతాయని నా అభిప్రాయం. నేను అందులో ప్రత్యేకం కాదు. కేసీఆర్ అంటే నాకు దైవంతో సమానం. ఆయన ఏది చెబితే అది చేస్తా. నేను 2009, 2014లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్రయత్నించా. కేసీఆర్ సార్ చెప్పడంతో ఆయన మాటే శిరసా వహించి ప్రయత్నం మానుకున్నా. 2018లో అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నా. కేసీఆర్ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నా. ఎక్కడ పది మంది కనిపిస్తే అక్కడికి వెళ్లి వాళ్ల కష్టాలు తెలుసుకుంటా. పథకాలు అందుతున్నయా అని అడుగుతా. ఎవరైనా ఇబ్బందులు చెప్పుకుంటే అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేస్తా. కేసీఆర్ పథకాలు మా గెలుపునకు తప్పక దోహదపడతాయి.
ప్రజలకు ఎలా చేరువయ్యారు?
సుంకె : నాకు ప్రజలే దేవుళ్లు. అసెంబ్లీ ఉంటే తప్పా నేను హైదరాబాద్ వెళ్లను. మిగతా అన్ని రోజులు నా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. వాళ్ల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నా. మరింత చేరువయ్యేందుకు ‘పొద్దు పొడుపు’ అనే కార్యక్రమాన్ని తీసుకున్నా. పొద్దు పొడవక ముందే ప్రజల ముంగిట ఉంటున్నా. ప్రభుత్వం ద్వారా వచ్చిన ప్రయోజనాలను లబ్ధిదారులకు అందిస్తున్నా. ముఖ్యంగా కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్, రైతుబీమా చెక్కులు లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి ఇస్తున్నా. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులతోపాటు లబ్ధిదారులకు చీరలు పెడుతున్నా. వాళ్లు నన్ను అన్నయ్యలా భావించి ఆప్యాయంగా చూసుకుంటున్నారు. చాలా మంది ఆడబిడ్డలు నాకు అనేక సందర్భాల్లో చెక్కరి కుడుకలు పోసి ఆశీర్వదించారు. ఇది నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చే సందర్భం.
నియోజకవర్గంలో ఇంకా చేపట్టాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా..?
సుంకె : నా దృష్టంతా సాగునీటి ప్రాజెక్టుల మీదనే ఉంది. వాటిని సాధించుకోవాలి. ప్రతి ఊరికీ సాగునీరు అందాలని ఆశిస్తున్నా. నా ఆశను సీఎం కేసీఆర్ దాదాపుగా తీరుస్తున్నారు. ఇంకా కొన్ని ప్రాజెక్టులు సాధించుకోవాలి. మద్దుట్లు ఎత్తిపోతలు, పోతారం, నారాయణపూర్ రిజర్వాయర్లను మరింత పటిష్ట పర్చుకోవాలి. విస్తరించుకోవాలి. వీటిని ఇప్పటికే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లా. కొన్ని పనులు ఎన్నికలకు ముందే ప్రారంభించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నా. ఎన్నికల తర్వాత మాత్రం నా దృష్టి ఈ ప్రాజెక్టుల మీదనే పెడుతా. ఒకప్పడు కరువుతో తండ్లాడిన చొప్పదండి ఇప్పుడు కోనసీమలా మారింది. ఈ మార్పు కేసీఆర్ సార్‌తోనే జరిగింది. ఇంకా అనేక పనులు చేపట్టాల్సి ఉన్నది. కేసీఆర్‌తోనే ఇది సాధ్యమవుతది.
నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయి?
సుంకె : బేషుగ్గా అమలవుతున్నాయి. పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నాం. ఎవరైనా లంచం తీసుకుంటే జైలుకు పంపిస్తానని హెచ్చరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. పథకాల అమలులో చొప్పదండి ఎంతో ముందున్నది. సీఎంఆర్ఎఫ్ ఇప్పించడంలో రాష్ట్రంలో సిద్దిపేట తర్వాత చొప్పదండి నియోజకవర్గమే ఉంటుంది. అనారోగ్యం బారిన పడిన వారికి, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి అంతలా సేవలు అందిస్తున్నాం.
రెండో సారి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చారు కదా.. ప్రజల్లోకి ఎలా వెళ్తారు?
సుంకె : నా ప్రచారాస్త్రం ఒక్కటే కేసీఆర్ సార్. ఆయన పేరు చెప్పుకొనే ఓట్లు అడుగుతా. ఎడారి లాంటి చొప్పదండికి సాగు, తాగు నీరందించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించారు. ఇంత కన్నా ఎక్కువ నాకు వేరే అస్త్రం లేదు. భవిష్యత్తులో చేసే పనులు చాలా ఉన్నాయి. వాటిని ప్రజల్లోకి వెళ్లి వివరిస్తా. కేసీఆర్‌కు నాపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతా.
కార్యకర్తల సహకారం ఎలా ఉన్నది?
సుంకె : కార్యకర్తలే నాకు బలం.. బలగం. కేసీఆర్ సార్ మరోసారి నాకు అవకాశం కల్పించినట్లు తెలుసుకుని అందరు సంతోషిస్తున్నారు. నేను ప్రతి క్షణం వారికి అందుబాటులో ఉంటా. వాళ్ల కష్టాల్లో పాలుపంచుకుంటుంటా. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాతోపాటు ప్రతి కార్యకర్త, ప్రజా ప్రతినిధి కృషి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కలిసి కట్టుగా పనిచేసి కేసీఆర్ సార్‌ను మరోసారి సీఎంగా చూడడమే ప్రతి కార్యకర్త లక్ష్యంగా పనిచేయబోతున్నారు.