చిగురుమామిడి, మే 6 : మండలంలో వడగండ్ల వానలతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని సీపీఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని సుందరగిరి, గాగిరెడ్డిపల్లి గ్రామాలలో సందవేణి మల్లయ్య రైతు మామిడి తోటను, ఇందుర్తి గ్రామంలో చింతపూల నరేందర్ వరి పంటను, సుందరగిరిలోని గంగు కుమార్ రేకుల షెడ్డును సీపీఐ మండల నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం మండలంలో ఈదురుగాలు, వడగండ్ల వానల వల్ల రైతులకు అపారమైన నష్టం వాటిల్లిందన్నారు.
ఈదురు గాలులకు మామిడి కాయలు రాలడంతో చాలా మంది రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి దెబ్బతిన్న పంటలకు తగిన నష్టపరిహారం అందించాలని లక్ష్మారెడ్డి కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు గూడెం లక్ష్మి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కాంతాల శ్రీనివాస్ రెడ్డి, సీపీఐ మండల సహాయ కార్యదర్శి బూడిద సదాశివ, పైడిపల్లి వెంకటేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు ముద్రకోల రాజయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి గోలి బాపు రెడ్డి, సుందరగిరి, గాగిరెడ్డి పల్లె గ్రామ శాఖ కార్యదర్శులు ఎలగందుల రాజు, మంద ఎల్లయ్య, మాజీ కార్యదర్శి తాళ్ళపెల్లి చంద్రయ్య, గందె కొమురయ్య, బుర్ర రాజయ్య గౌడ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.