Vemulawada | వేములవాడ, జూన్ 18 : పురపాలక సంఘంలో పనిచేస్తున్న ప్రతీ కార్మికుడికి రూ.26 వేల వేతనం ఇవ్వాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి గుర్రం అశోక్ డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా రిలే నిరాహార దీక్షలను గురువారం వేములవాడ మున్సిపల్ కార్యాలయం ముందు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలో భాగంగా ప్రతీ ఒక్క కార్మికుడికి రూ.26 వేల వేతనం ఇవ్వాలన్నారు. ప్రతీ కార్మికుడికి ఉద్యోగ భద్రతను కూడా కల్పించాలన్నారు. 60 ఏళ్ల వయసు దాటిన కార్మికుల తొలగించి వారి స్థానంలో వారి వారసులకు అవకాశం కల్పించాలన్నారు. పీఎఫ్ ఈఎస్ఐ కూడా సక్రమంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మోసం రమేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు సరిపల్లి నరేష్, ప్రధాన కార్యదర్శి దుబ్బల లచ్చయ్య, ఉపాధ్యక్షులు సుంకపాక పరుశరాములు, సావనపల్లి శ్రీనివాస్, బొడ్డు శ్రీనివాస్, ఎండీ అజ్జు, శ్రీనివాస్ గాజుల వజ్రమ్మ, వావిలాల లక్ష్మి, పుప్పాల మమత, వావిలాల రాధా తదితర కార్మికులు పాల్గొన్నారు.