కార్పొరేషన్ మార్చ్ 26 : కరీంనగర్ నగరపాలక సంస్థలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిఆర్టియు ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన బాట పట్టారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బిఆర్టియు నాయకులు రూప్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కార్మికులకు వెంటనే రూ.26 వేల కనీస వేతనం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు కార్మికులను ప్రతిరోజు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటికైనా అధికారులు తమ పనితీరును మార్చుకోవాలని డిమాండ్ చేశారు. 60 ఏళ్లు దాటిన కార్మికులకు స్థానాల్లో వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిబంధనలు ఉన్న నగరపాలక అధికారులు వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విధి నిర్వహణలో భాగంగా గాయాలపాలు అయి అనారోగ్యానికి గురి అయిన వారి స్థానాల్లో వారి కుటుంబ సభ్యులను నియమించేందుకు అవకాశం ఉన్న నగరపాలక ఉన్నతాధికారులు వాటిని పక్కనపెట్టి కార్మికులను తొలగిస్తున్నారని విమర్శించారు.
ఉన్న కార్మికులను తొలగించి ముడుపులు తీసుకొని కొత్త కార్మికుల నియామకాలకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వీటన్నింటిపై వెంటనే జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్మిక సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.