చిగురుమామిడి, డిసెంబర్ 4: కంటి చూపు సమస్యతో బాధపడుతున్న గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణాలకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15, 2018న కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కంటి వెలుగు ప్రారంభం కావడంతో మండలంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో విశేష స్పందన లభించింది. అధిక సంఖ్యలో పాల్గొని ప్రజలు కంటి పరీక్షలు చేయించుకున్నారు. మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు గాను 32,500 మంది కంటి వెలుగు పరీక్షలు వినియోగించుకున్నారు.
అవసరమైన వారిని గుర్తించి 22,100 మందికి కంటి అద్దాలను ప్రభుత్వం ఉచితంగా అందజేసింది. 2 వేల మందికి కంటి శస్త్ర చికిత్సలు చేయాలని వైద్యులు గుర్తించారు. 2019లో కంటివెలుగు కార్యక్రమాన్ని నిలిపివేయడంతో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. దీంతో ప్రభుత్వం గ్రామీణ ప్రజల అవసరాన్ని గుర్తించి మరోసారి రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని జనవరి 18, 2023లో నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆదేశాలతో వైద్యులు అప్రమత్తమయ్యారు.
మొదటి విడుత 2018 ఆగస్టు 15న నుంచి 2019 ఫిబ్రవరి 15 వరకు మొదటి విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. మండలంలోని అన్ని గ్రామాల్లో వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ముందుగానే గ్రామాలకు తేదీలు ఖరారు చేయగా, వైద్య శిబిరాలకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి పరీక్షలు చేయించుకున్నారు. సాధారణ సమస్యలు ఉన్న వారిని గుర్తించి అకడికకడే ఉచితంగా కళ్లజోడు అందజేశారు. తీవ్ర సమస్య ఉన్నవారికి 2,325 మందిని గుర్తించి శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారు. మండలంలోని చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి, సుందరగిరి, ఇందుర్తి, నవాబుపేట, ములనూర్, ముదిమాణిక్యం గ్రా మాల్లో కంటి వెలుగు వైద్య శిబిరంలో అధిక సంఖ్యలో ప్రజలు పరీక్షలు చేయించుకున్నారు.
కంటి వెలుగు కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఒకో బృందంలో కంటి వైద్య నిపుణుడు, ఆఫ్తాలమిక్ అధికారి, ఏఎన్ఎం, ఆరోగ్య పర్యవేక్షకుడు, ఆశ కార్యకర్తలను నియామకం చేస్తున్నారు. ఒకో బృందం వారికి కేటాయించిన గ్రామాల్లోకి వెళ్లి కంటి పరీక్షలు చేయనున్నారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి కళ్లజోడు లేదా శస్త్రచికిత్సలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది.
కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి ఇంట్లో కంటి సమస్యతో బాధపడేవారు చాలామంది ఉన్నారు. ఇది వారికి ఎంతో ఉపయోగపడుతుంది అవసరమైన వారికి కళ్లజోడు అందజేయడంతోపాటు శస్త్ర చికిత్స చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం సంతోషకరం.
-తిప్పారపు శ్రీనివాస్, ఆప్తాలమిక్ అధికారి
రాష్ట్ర ప్రభు త్వం రెండో వి డుతలో భా గం గా జనవరి 18 నుంచి కంటి ప రీక్షలు నిర్వహించాలని ఆదేశా లు జారీ చేసింది. మండలంలోని అన్ని గ్రామాల్లో బృందాలుగా కంటి పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేపడుతున్నాం. గ్రామాలకు తేదీలను ఖరారు చేసి శిబిరాలను నిర్వహిస్తాం.
-నాగశేఖర్, మండల వైద్యాధికారి, చిగురుమామిడి
రెండో విడుత చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. అవసరమైన వారు కంటి పరీక్షలు చేయించుకొని కళ్లజోడు వినియోగించుకోవాలి. ప్రభుత్వం అందజేస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గ్రామాల్లోని ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావాలి. ఈ కార్యక్రమంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి.
-ఎంపీపీ, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్, చిగురుమామిడి