– బాలాజీ ఆత్మహత్యకు కారణమైన భార్య, ఆమె ప్రియుడిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి
– న్యాయం జరిగే వరకు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కదలం
– పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా, ఎస్ఐ వాహనాన్ని అడ్డుకున్న బాధితులు
మర్రిగూడ, ఫిబ్రవరి 09 : మర్రిగూడ మండలంలోని వెంకేపల్లి తండాకు చెందిన జటావత్ బాలాజీ నాయక్ (35), రజిత దంపతులు. వీరికి 15 ఏళ్ల లోపు కుమార్తె, కుమారుడు ఉన్నారు. బాలాజీ నాయక్ హైదరాబాద్‌లో కారు డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన జటావత్ హాథిరామ్ వరసకు వదిన అయినా రజితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇతను ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. హాథిరామ్ కు ఇంకా వివాహం కాలేదు. గత కొద్ది కాలంగా వీరి మధ్య జరుగుతున్న వివాహేతర సంబంధం బాలాజీ నాయక్ కు తెలిసి మందలించాడు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టి కూడా హెచ్చరించాడు. వారిద్దరు తీరు మార్చుకోలేదు. ఇంటి వద్ద బాత్రూంలో వారిరువురు ఈ నెల 2న ఏకాంతంగా ఉండడానికి చూసి భర్త తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనస్థాపానికి గురైన బాలాజీ నాయక్ తన కుమారుడు చరణ్ తో సెల్ఫీ వీడియో తీస్తూ తన ఆవేదనను వెల్లగక్కాడు. అందులో బతకలేనని పేర్కొన్నాడు. క్షణికావేశంతో ఈ నెల 3న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుమారుడు ఇరుగుపొరుగు వారికి చెప్పడంతో హుటాహుటిన బాలాజీని హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఈ నెల 7న మరణించాడు. మృతదేహాన్ని అదే రోజున పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలాజీ సోదరుడు సాగర్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పచ్చని సంసారంలో చిచ్చు పెట్టిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు హాథిరామ్ ను, భర్త మందలించినా ఇంతటి ఘాతుకానికి పాల్పడిన రజితను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాలాజీ కుటుంబ సభ్యులు, బంధువులు పిల్లలతో కలిసి మర్రిగూడ పోలీస్ స్టేషన్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. అభం శుభం తెలియని చిన్నారులకు దిక్కు లేకుండా పోయిందని వారికి న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పోలీసులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయడం లేదని, మృతదేహాన్ని కూడా అప్పగించడం లేదని వారు మండిపడ్డారు.
బాలాజీ నాయక్ మృతికి కారణమైన నిందితులను పోలీసులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. ఎస్ఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చనిపోయి రెండు రోజులు కావస్తున్న ఇంతవరకు డెడ్ బాడీ అప్పగించలేదన్నారు. న్యాయం చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులకు ఏ రకమైన కేసులు పెట్టారో, పిల్లల భవిష్యత్‌కు ఏ భరోసా కల్పిస్తారో అర్థం కావడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు ఇక్కడ నుండి కదిలేది లేదని ఎస్ఐ వాహనాన్ని అడ్డుకుని తీవ్ర వాగ్వివాదానికి దిగారు. న్యాయం జరిగే వరకు పోలీస్ స్టేషన్ దగ్గరే ఉంటామని వారు పేర్కొన్నారు.

‘బాలాజీ నాయక్ పిల్లలకు న్యాయం చేయాలి’