Chada Venkat Reddy | చిగురుమామిడి, జూన్ 19 : ప్రధానమంత్రి మోడీ నియంతృత్వ పోకూడలతో ప్రభుత్వ పాలన నీరుగారి పోతోందని, తెలంగాణ లో చిచ్చుపెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుందని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. 12 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రధానమంత్రి మోడీ సంబరాలు జరుపుకుంటున్నాడని, ఏం సాధించాడని అన్నారు. 750 రైతులను పొట్టన పెట్టుకున్న కేంద్రం క్షమాపణ చెప్పాలన్నారు. కేంద్రం కార్మికులకు శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వడం లేదన్నారు. గుజరాత్ సీఎం గా ఉన్న మోడీ చిన్న వ్యాపారిగా ఉన్న ఆదానీని ప్రపంచంలోనే సంపన్న ధనవంతుడిగా చేశాడని అన్నారు.
రూ.55 లక్షల కోట్ల అప్పులతో ఉండగా ప్రధాని అయిన మోడీ ఇప్పటికీ రూ.214 లక్షల కోట్ల అప్పులు చేశారని తెలిపారు. పోరాటాలు చేసేందుకు అవకాశం లేకుండా ప్రభుత్వం కుట్రలు పన్నుతుందన్నారు. మావోయిస్టులను అంతం చేస్తామని శపధం చేసిన కేంద్ర హోం మంత్రి సిద్ధాంతాలను పోరాటాలను అణిచివేయలేరని అన్నారు. ప్రశ్నించిన వారిపై రాజా ద్రోహం కేసులు పెట్టి అణిచివేతకు గురిచేస్తున్నారని అన్నారు. శ్రమకు తగ్గ ఫలితం కార్మికులకు కేంద్రం ఇవ్వడం లేదని, కార్పొరేట్ సంస్థలకు కేంద్రం కొమ్ముకాస్తుందన్నారు. బీజేపీలో క్రమశిక్షణ పూర్తిగా లోపించిందని, పోరాటాలు ఉద్యమాలు చేసిన చరిత్ర బిజెపికి లేదన్నారు. కమ్యూనిస్టులు కార్మికుల పక్షాన తెలంగాణ సాయుధ పోరాటం తోపాటు కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు ఉద్యమాలు చేసిన ఘనత ఉందని గుర్తు చేశారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీబీ రాంజీ పేరు మారుస్తూ 60 శాతం నిధులు మాత్రమే ఇస్తామని కేంద్రం ప్రకటించడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీ లు రాష్ట్ర అభివృద్ధి కోసం ఏరోజు పెదవి విప్పిన చరిత్ర లేదన్నారు. ప్రాణహిత, చేవెళ్ల కోసం, మెట్రో రైళ్లు, ఉక్కు ఫ్యాక్టరీ కోసం కేంద్రంలో గళం విప్పిన సందర్భాలు తెలంగాణ ఎంపీలకు లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు బీజేపీకి ఇష్టం లేదని అన్నారు. తెలంగాణలో చిచ్చుపెట్టే ప్రయత్నం కేంద్రం చేస్తుందన్నారు. 1400 మంది విద్యార్థుల బలిదానంతో ప్రత్యేక తెలంగాణ సిద్ధించిందని, సీపీఐ ప్రత్యేక రాష్ట్రాన్ని కోసం సీపీఐ ఉద్యమం చేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. మక్కల కొనుగోలు జరిగి నెలలు నిలుగడుస్తున్నప్పటికీ రైతుల ఖాతాలో ఇప్పటివరకు బిల్లుల చెల్లింపులు జరగలేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సీపీఐ పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం నిరంతరం పోరాట పోరాటాలు చేస్తుందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అందే స్వామి, మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి, జిల్లా నాయకులు గోలి బాపురెడ్డి,బూడిద సదాశివ, పైడిపల్లి వెంకటేష్, తేరాల సత్యనారాయణ, అందే చిన్నస్వామి, మావురపు రాజు, రాకం అంజవ్వ, తమ్మిశెట్టి రవీందర్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.