రిజర్వాయర్లలో నీటిని వినియోగించుకోవాలంటే ముందుగా ఎవరి వాటా ఎంతనేది తేలాలి. అందుకోసం పూర్తిస్థాయి బోర్డు మీటింగ్ నిర్వహించాలి. వాటాలు ఖరారైన తర్వాత త్రీమెన్ కమిటీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న జలాలు, అవసరాలపై చర్చలు జరుపాలి. జలాలను ఒప్పంద నిష్పత్తిలోనే వినియోగించుకోవాలి. కానీ, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) మునుపెన్నడూ లేనివిధంగా వింతపోకడలకు తెరలేపింది. వాటాలు ఖరారు కాకముందే, రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండకముందే, నీటి వినియోగంపై ఏపీ ప్రతిపాదనలకు అనుగుణంగానే త్రీమెన్ కమిటీ సమావేశ నిర్వహణకు సిద్ధమైంది. ఇంత జరుగుతున్నా ఈ విషయమై రేవంత్‌రెడ్డి సర్కార్.. బోర్డును నిలదీయలేని దుస్థితిలో ఉన్నది. ఏపీ ప్రతిపాదనలకే పరోక్షంగా వంతపాడుతూ ఆ భేటీకి సై అంటున్నది.
హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాలపై 2026-27నీటి సంవత్సరానికి సంబంధించి ఇరు రాష్ర్టాల మధ్య ఎలాంటి ఒప్పందం జరుగకున్నా ఏపీ సర్కార్ కుట్రలకు తెరలేపింది. రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండకముందే నీటి వినియోగానికి సంబంధించి చర్చలకు తెరతీయగా, బోర్డు దానికే వత్తాసు పలుకుతున్నది. అదీగాక ప్రస్తు తం అందుబాటులో ఉన్న జలాల్లో ఏకంగా 70% వాటా కావాలని డిమాండ్ చేయడం, తెలంగాణకు గతంలో కంటే తక్కువగా కేవలం 30% వాటానే చాలనడం గమనార్హం. కృష్ణా జలాలకు సంబంధించి ట్రిబ్యునల్ కేటాయింపులు లేని నేపథ్యంలో రాష్ట్ర విభజన సందర్భంగా రెండు రాష్ర్టాలు కేవలం ఏడాదికాలం కోసమే తాత్కాలిక ఒప్పందం చేసుకొన్నాయి. ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి కృష్ణా జలాలను ఏపీ 66%, తెలంగాణ 34% వినియోగించుకోవాలని తాత్కాలిక ఒప్పందమే చేసుకొన్నాయి.
ఆ తర్వాత ప్రతి నీటి సంవత్సరం అంటే జూన్1 నుంచి మే 31వ వరకు ఉమ్మడి రిజర్వాయర్ల మధ్య నీటి వినియోగాలకు సంబంధించి ఇరు రాష్ర్టాలు ఆ తాత్కాలిక ఒప్పందాన్ని మరో ఏడాదికి పొడిగించుకుంటూ వచ్చాయి. అందుకోసం పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని నిర్వహించి, అందులో చర్చించి ఇరు రాష్ర్టాలు కేవలం ఆ తాగునీటి సంవత్సరానికి సంబంధించి మాత్రమే ఒ ప్పందం చేసుకోవడం పరిపాటిగా కొనసాగుతున్నది. 2018 నుంచే గత బీఆర్ఎస్ ప్రభు త్వం 66:34 నిష్పత్తిలో జలాల వినియోగానికి సంబంధించి తాత్కాలిక ఒప్పందానికి సైతం ససేమిరా అన్నది. ట్రిబ్యునల్ అవార్డు పూర్తయ్యే వరకూ ఇక 50:50 నిష్పత్తిలో కృష్ణా జలాలను వాడుకుంటామని తేల్చిచెప్పింది. 2022-23 నీటి సంవత్సరంలో ఒప్పందమే జరుగలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ గత బీఆర్ఎస్ డిమాండ్‌ను అటకెక్కించింది. మళ్లీ 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాలను వినియోగించుకొనేందుకు 2024-25 నీటి సంవత్సరంలో అంగీకరించింది. 2025-26 నీటి సంవత్సరంలో ఒప్పందాల ముచ్చటే ఎత్తలేదు. ఏపీ దాదాపు 72 శాతం జలాలను తరలించుకుపోయినా రేవంత్‌రెడ్డి సర్కార్ నోరు మెదపలేదు.
కుట్రపూరితంగానే త్రీమెన్ కమిటీ!
బోర్డు సమావేశాన్ని నిర్వహించకుండా కుట్రపూరితంగానే ప్రస్తుతం నేరుగా త్రీమెన్ కమిటీ సమావేశానికి తెరతీసినట్టు తెలుస్తున్నది. వాస్తవంగా బోర్డు సమావేశంలో కేఆర్ఎంబీ చైర్మన్, మెంబర్ సెక్రటరీ, టెక్నికల్ మెంబర్లు, ఇరు రాష్ర్టాల సెక్రటరీలు సభ్యులుగా ఉంటారు. ఇరు రాష్ర్టాల మధ్య జలాల వినియోగం, వివాదాల అంశాలపై బోర్డులోనే చర్చిస్తారు. వాటాలను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఏకాభిప్రాయం కుదరని అంశాలను కేంద్రానికి నివేదిస్తారు. అధికారిక గుర్తింపు ఉంటుంది. ప్రతి నీటి సంవత్సరం జూన్1 నుంచి మే31 వరకు నీటి వినియోగ వాటాలపై బోర్డులోనే నిర్ణయం తీసుకుంటారు. ఏ రాష్ర్ర్టానికి ఎంత వాటా అనేది ఖరారు చేసుకుంటారు. త్రీమెన్ కమిటీ అనేది బోర్డు సమావేశం నిర్ణయించిన వాటాలను మాత్రమే అమలు చేయాల్సి ఉన్నది. రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న జలాలు, అవసరాల మేరకు ఇరు రాష్ర్టాలు ప్రతిపాదనలు పెట్టడం, వాటిపై త్రీమెన్ కమిటీ చర్చించి, బోర్డులో నిర్ణయించిన వాటాల మేరకు పంపిణీ చేయడం, అందుకు అనుగుణంగా నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేయడం పరిపాటిగా కొనసాగుతున్నది. కానీ ఈ ఏడాది బోర్డు సమావేశం లేకుండా, వాటాలు తేలకముందే నేరుగా త్రీమెన్ కమిటీ సమావేశం ఏర్పాటుకు సిద్ధమవడం గమనార్హం.
ఏపీ ప్రతిపాదనలకే మొగ్గు
నేరుగా త్రీమెన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో ఏపీ కుట్ర దాగి ఉన్నదని స్పష్టమవుతున్నది. బోర్డు సైతం ఏపీ ప్రతిపాదనలకే మొగ్గు చూపుతున్నది. ఏపీ లేఖ రాయగానే, గతంలో ఎన్నడూ లేనివిధంగా, బోర్డు సమావేశాన్ని నిర్వహించకుండా, కేవలం త్రీమెన్ కమిటీ సమావేశాన్ని 17వ తేదీన ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అందినకాడికి జలాలను మళ్లించుకుపోవడమే లక్ష్యంగా నేరుగా త్రీమెన్ కమిటీ సమావేశానికి తెరతీసినట్టు తెలుస్తున్నది. బోర్డు సమావేశం నిర్వహిస్తే వాటాలను తేల్చాల్సి ఉంటుంది. ఆ మేరకే జలాలను వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చేయకుండా, నీటి వినియోగాలపై మాత్రమే సింగిల్ ఎజెండాగా త్రీమెన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ చేస్తున్నది. ఆ మేరకు బోర్డుకు లేఖ రాసింది. ఎందుకంటే త్రీమెన్ కమిటీలో వాటాల నిర్ణయం ఉండబోదు. అందుబాటులో ఉన్న జలాలనే పరిగణనలోకి తీసుకొని వినియోగాలకు అనుమతినిస్తారు.
నోరెత్తని రేవంత్ సర్కార్.. ఏపీకి జీ హుజూర్
బోర్డు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నా, ఏపీ ప్రతిపాదనలకు మొగ్గు చూపుతున్నా రేవంత్‌రెడ్డి సర్కార్ నోరెత్తని దుస్థితి నెలకొన్నది. ఏపీ ప్రతిపాదనలకు అనుగుణంగా బోర్డు నిర్ణయాలు తీసుకుంటున్నా నిలదీసేందుకు ముందుకు రావడం లేదు. ఏపీ ప్రతిపాదనలకు అడుగడుగునా అనుకూలంగానే వ్యవహరిస్తున్నది. బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని, నీటివాటాల అంశాన్ని తేల్చాలని రేవంత్ సర్కార్ డిమాండ్ చేయడమే లేదు. గతేడాది సైతం ఇదే రీతిన వ్యవహరించింది. 2025-26 నీటి సంవత్సరంలో ఎలాంటి ఇండెంట్లు, నీటి విడుదల ఆర్డర్లు లేకుండానే కృష్ణా జలాలను ఏపీ భారీ ఎత్తున మళ్లించుకుపోయింది. రాష్ట్ర విభజన అనంతరం చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా గరిష్ఠస్థాయిలో దాదాపు 71శాతం జలాలను తరలించుకుపోయింది. ఒక్క పోతిరెడ్డిపాడు ద్వారా 240 టీఎంసీలను మళ్లించుకుపోయింది. అదే సమయంలో తెలంగాణ సర్కార్ చరిత్రలోనే లేనంత కనిష్ఠస్థాయిలో జలాలను వినియోగించుకున్నది. ఇంత జరుగుతున్నా రేవంత్ సర్కార్ మాత్రం నోరెత్తనే లేదు. ఏపీని నిలువరించేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. బోర్డుపైనా ఎలాంటి ఒత్తిడి తేలేదంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం ఏరీతిగా ఉన్నదో తెలిసిపోతున్నది.