హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో 73 లక్షల ఓట్ల రద్దుకు పాలకపార్టీలు కుట్రలు చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆరోపించారు. శనివారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని పార్టీ కార్యాలయంలో పతాకావిష్కరణ చేశారు. ఆయన మాట్లాడారు. మోదీ పాలనలో దేశంలో యథేచ్ఛగా హక్కుల హననం జరుగుతున్నదని ధ్వజమెత్తారు. ప్రజాఉద్యమాలను అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని ప్ర శ్నార్థకం చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి దేశాన్ని తిరోగమనంవైపు తీసుకెళ్తున్నాయని వ్యా ఖ్యానించారు.
పాలకుల అసంబద్ధ విధానాలతో సాగురంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. మహిళలు, చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని వాపోయారు. దేశ ప్రజలను కులమతాల పేరిట విచ్ఛిన్నం చేస్తున్నారని పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టీ జ్యోతి, జూలకంటి రంగారెడ్డి, జీ నాగయ్య, టీ సాగర్ పాల్గొన్నారు.