హుస్నాబాద్, ఆగస్టు 15: మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్‌కు జీవనాధారమైన గౌరవెల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ విమర్శించారు. శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యావరణ, ఎన్జీటీ అనుమతుల కోసం కోర్టులను ఆశ్రయించొద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సంబరపడిన కాంగ్రెస్ శ్రేణులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
ప్రధానమైన ఎన్టీజీ కేసు అలాగే ఉన్నదనే విషయం వారికి తెలియకపోవడం వారి తొందరపాటుకు నిదర్శనమన్నారు. రెండున్నరేండ్లు గడిచినా గౌరవెల్లిలో తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. కనీసం ప్రాజెక్టుపై ఉన్న ఎన్జీటీ కేసును కూడా ఎత్తివేయడంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పూర్తిగా విఫలమయ్యాడని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో గౌరవెల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేసి ట్రయల్న్ద్వ్రారా నీటిని నింపామని, ఇది చూసి ఓర్వలేని కాంగ్రెస్ నాయకులే ఎన్జీటీలో కేసులు వేయించారని తెలిపారు. వారు వేయించిన ఎన్జీటీ కేసు వారి మెడకే చుట్టుకున్నదని ఎద్దేవా చేశారు. రోడ్లపై బొమ్మలు పెట్టి, పలుచోట్ల పార్కు లు నిర్మిస్తే అభివృద్ధి జరిగినట్లా అని ప్రశ్నించారు.
వీటి వల్లప్రజల సమస్యలు తీరవన్నారు. తాగు, సాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళికలు రూపొందించడంలో విఫలమయ్యారన్నారు. ఇప్పటికైనా చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు మిడ్‌మానేరు ద్వారా, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలకు దేవాదుల ద్వారా నీళ్లు ఇచ్చేందుకు మంత్రి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గౌరవెల్లి ఎన్జీటీ కేసును త్వరగా రద్దు చేయించి అందులో నీళ్లు నింపడం ద్వారా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల రైతుల పంటలు పండేలా చూడాలన్నారు. రానున్న కరువు పరిస్థితుల్లో ప్రజలు చేపట్టబోయే ఆందోళనలు, ఉద్యమాలకు మం త్రి పొన్నం బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.