నాడు ఉమ్మడి రాష్ట్రంలో పల్లెలను పట్టించుకున్న పాపానపోలేదు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నా కన్నెత్తి చూడలేదు. గ్రామ సచివాలయాలు శిథిల, అద్దె భవనాల్లో కునారిల్లుతున్నా కనీసం పట్టించుకోలేదు. కానీ, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది. ‘పల్లె ప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మారుస్తున్నది. నాడు అద్దె భవనాల్లో కొనసాగిన పంచాయతీలకు ఆధునిక సౌధాలు నిర్మిస్తున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో వంద జీపీలకు సొంత భవనాలు నిరిస్తున్నది. ఒక్కో దానికి రూ.20 లక్షలు వెచ్చించి అన్ని హంగులతో తీర్చిదిద్దుతుండగా, మూడు నాలుగు నెలల్లోనే అందుబాటులోకి వచ్చే అవకాశమున్నది.
– రాజన్న సిరిసిల్ల, మార్చి 22 (నమస్తే తెలంగాణ)
రాజన్న సిరిసిల్ల, మార్చి 22 (నమస్తే తెలంగాణ): పల్లెల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మిస్తున్నది. మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. జిల్లాలో 255 పంచాయతీలుండగా, పక్కా భవనాలు లేని 100 జీపీలకు ఒక్కో భవనానికి రూ. 20లక్షల చొప్పున విడతల వారీగా 20 కోట్లు ఇచ్చింది. నిధులు రావడంతో భవనాల నిర్మాణాలను దశల వారీగా ప్రారంభించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 68, వేములవాడ నియోజకవర్గంలో 18, మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలో 10, చొప్పదండి నియోజకవర్గంలోని బోయినిపల్లి మండలంలో 4 పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మిస్తున్నారు. అందులో గంభీరావుపేట మండలంలో 13, ముస్తాబాద్ మండలంలో 15, తంగళ్లపల్లి మండలంలో 15, వీర్నపల్లి మండలంలో 12, ఎల్లారెడ్డిపేట మండలంలో 12,సిరిసిల్ల అర్బన్ మండలంలో 1, చందుర్తి మండలంలో 5, కోనరావుపేటలో 5, రుద్రంగిలో 1, వేములవాడ అర్బన్ మండలంలో 2, వేములవాడ రూరల్ మండలంలో 5, బోయినిపల్లి మండలంలో 4, ఇల్లంతకుంట మండలంలో 10 భవనాలను నిర్మిస్తుండగా, పంచాయతీ రాజ్‌శాఖ అధికారులు పనులను వేగవంతం చేశారు. ఇప్పటికే 36 భవనాలు తుది దశకు చేరగా, మరో 64 ప్రగతిలో ఉన్నాయని చెబుతున్నారు.
పంచాయతీ భవనాలను ఆధునిక హంగులతో అన్నీ ఒకే డిజైన్‌లో ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఒక్కో జీపికి అక్కడ ఉన్న స్థలాన్ని బట్టి ఎకరం నుంచి 5గుంటల స్థలంలో నిర్మిస్తున్నారు. సర్పంచ్, కార్యదర్శులకు ప్రత్యేక గదులు, పాలకమండలి సమావేశ మందిరం, మహిళా సంఘాలకు సమావేశ మందిరం అందులో ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు, పురుషులకు టాయిలెట్లు, భవనాల చుట్టూ పూల మొక్కలతో చిన్నపాటి పార్కులా తీర్చిదిద్దుతున్నారు. ముస్తాబాద్ మండలంలో ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవతో రెండంతస్తుల భవనం నిర్మించి రాష్ర్టానికే ఆదర్శంగా నిలిపారు. అదే తరహాలో గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేటలో పంచాయతీ భవనం నిర్మించారు. మూడు నాలుగు నెలల్లో అన్ని భవనాలను పూర్తి చేయనున్నారు.
చాలా ఏండ్లుగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న జీపీలకు తెలంగాణ ప్రభుత్వంలో మోక్షం లభించింది. మంత్రి కేటీఆర్ చొరవతో సిరిసిల్ల జిల్లాలో 100 పంచాయతీలకు అన్ని హంగులతో పక్కా భవనాలు నిర్మిస్తున్నాం. అన్నీ ఒకే డిజైన్‌లో నిర్మిస్తున్నాం. వచ్చే జూన్, జూలై వరకు అన్ని అందుబాటులోకి తెచ్చేలా పనులు వేగవంతం చేశారు. ఒక్కో భవనానికి రూ. 20లక్షల వరకు ఖర్చు చేస్తున్నాం. ఎక్కడా నిధుల కొరత లేదు. ఉపాధి హామీలో భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి.
– యెనగందుల రవీందర్, డీపీవో (రాజన్న సిరిసిల్ల)