జమ్మికుంట, ఏప్రిల్ 17 : ‘అధైర్యపడొద్దు. అండగా ఉంట. ఒక అన్నగా మీ కుటుంబానికి తోడుంట. అక్కడ సీఎం కేసీఆర్ ఉన్నడు. ఇక్కడ నేనున్న. ధైర్యంగా ఉండు’ అంటూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఆత్మహత్యాయత్నం చేసిన బాధిత మహిళకు ధైర్యాన్నిచ్చారు. చెల్పూరు సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్ వేధింపులు తాళలేక జమ్మికుంటకు సుల్తానా గత బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా. జమ్మికుంటకు చెందిన సప్తగిరి దవాఖానలో చేర్పించారు. సోమవారం ఆమెను పాడి కౌశిక్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితురాలు తన గోడు వెల్లబోసుకున్నారు.
13 ఏండ్ల సంది మటన్/చికెన్ షాపు పెట్టుకుని జీవిస్తున్నానని, నాలుగేండ్లుగా మహేందర్ గౌడ్, అజ్జూతో కలిసి వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఉన్నపలంగా తన షాపును తొలగించడంతో మనోవేదనకు గురై పురుగుల మందు తాగానని బోరున విలపించింది. దీంతో కౌశిక్ చలించిపోయారు. ’నీకు మళ్లీ డబ్బా పెట్టిస్త. ఇల్లడుగు జాగ ఇప్పిస్త. ఇల్లు కట్టుకునేలా చేస్త’. అని బాధితురాలికి హామీ ఇచ్చారు. అనంతరం దవాఖాన వైద్యుడిని బాధితురాలు పరిస్థితిని అడిగారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యుడికి సూచించారు. బిల్లు ఎంతైనా సరే.. చెల్లిస్తామని చెప్పారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్నా కోటి, హుజూరాబాద్ ఎంపీపీ రాణీసురేందర్రెడ్డి, పలువురు కౌన్సిలర్లు తదితరులున్నారు.