జగిత్యాల, జూన్ 7 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచిందని నిజామాబాద్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. శనివారం జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఆమె పలు శుభకార్యాలకు హాజరయ్యారు. పలువురు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా జగిత్యాలలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించిందని ధ్వజమెత్తారు. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డీఏలు విడుదల చేస్తామని చెప్పి కేవలం ఒక డీఏ విదిల్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఉద్యోగులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, బాధపడుతున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలను ఉద్యోగులకు ఇచ్చి వారిని నిండా ముంచిందని, అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని, పెండింగ్ డీఏలన్నీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.