చొప్పదండి, ఏప్రిల్ 23: అన్నదాతలు అధైర్యపడొద్దని, ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసా ఇచ్చారు. కాగా, మండలంలో శనివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానతో సుమారు 2200 ఎకరాల్లో వరి, 50 ఎకరాల్లో మక, 200 ఎకరాల్లో మామిడి తోటలు, పదెకరాల్లో మిర్చి పంటకు నష్టం జరిగింది. ఆదివారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పంటలు దెబ్బతిన్న రైతులతో ఫోన్లో మాట్లాడారు. అధైర్యపడొద్దని, నష్టపోయిన ప్రతి ఎకరాకూ నష్టపరిహారం వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. అలాగే, మండలంలో దెబ్బతిన్న పంటల వివరాలు సేకరించి, నష్టపరిహారం వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కాగా, వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మారెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుకారెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ గుడిపాటి వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు మాచర్ల వినయ్‌కుమార్, ఏవో వంశీకృష్ణ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మారెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుకారెడ్డి హామీ ఇచ్చారు. రైతులు అధైర్యపడొద్దని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. వెదురుగట్టలో సుమారు 1500 ఎకరాల్లో వరి పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలను సర్పంచులు శంకర్, లావణ్య, సింగిల్‌విండో డైరెక్టర్లు నాంపెల్లి మల్లయ్య, రాజిరెడ్డి, నాయకులు చందు, గుడిపాటి చిన్న, మారం యువరాజ్, శ్రీనివాస్, లంబు సుధాకర్‌రెడ్డి పరిశీలించారు.
తడిసిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం
రామడుగు, ఏప్రిల్ 23: తడిసిన ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఏఎంసీ చైర్మన్ మామిడి తిరుపతి పేర్కొన్నారు. గోపాల్రావుపేట వ్యవసాయ మార్కెట్లో తడిసిన వరి ధాన్యాన్ని ఆదివారం ఆయన పాలకవర్గ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మామిడి తిరుపతి మాట్లాడుతూ, రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. పంట నష్టం వివరాలను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం వచ్చేలా కృషి చేస్తారని పేర్కొన్నారు. ఆయన వెంట ఏఎంసీ వైస్ చైర్మన్ చాడ ప్రభాకర్‌రెడ్డి, డైరెక్టర్లు కొలిపాక మల్లేశం, చెన్నూరి శ్రీకాంత్‌రెడ్డి, భవానీసురేశ్, మచ్చ గంగయ్య, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు వేల్పుల హరికృష్ణ, పార్టీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పైండ్ల శ్రీనివాస్, రైతులు ఉన్నారు.
దెబ్బతిన్న పంటల సర్వే
రామడుగు, ఏప్రిల్ 23: మండలంలోని అన్ని గ్రామాల్లో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటల వివరాలను వ్యవసాయాధికారులు సేకరించారు. మండల ఇన్చార్జి వ్యవసాయాధికారి సంజీవరెడ్డి మాట్లాడుతూ, దత్తోజీపేట, శ్రీరాములపల్లి, తిర్మలాపూర్, లక్ష్మీపూర్, షానగర్ గ్రామాల్లో పంట నష్టం తీవ్రంగా ఉందన్నారు. దత్తోజీపేటకు చెందిన జనార్దన్‌రెడ్డి అనే రైతు ఆరెకరాల్లో వరి వేయగా వడగండ్లతో ఏమి మిగులకుండా పోయిందన్నారు. శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన కొస్న వెంకటరెడ్డి అనే రైతు రెండెకరాల్లో (బ్లాక్ రైస్, రెడ్ రైస్) ఆర్గానిక్ వరి సాగు చేస్తుండగా, మిగతా ఆరెకరాల్లో దొడ్డురకం బాస్మతి సాగు చేయగా, ధాన్యం మొత్తం రాలిపోయిందన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం మండలంలో 3,330 ఎకరాల్లో వరి, 32 ఎకరాల్లో మక్క పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఈకార్యక్రమంలో ఏఈవోలు అజిత్, రాజేశ్, సంపత్, రమేశ్ పాల్గొన్నారు.
మండలంలోని ఆయా గ్రామాల్లో వరి పొలాలు నెలకొరిగాయి. మామిడికాయలు నేలరాలాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. వర్షంతో మండలంలో సుమారు 90 శాతం పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు.