చొప్పదండి/రామడుగు, ఏప్రిల్ 26: రా ష్ట్రంలో రైతులను ఆదుకుంటున్నది, రాబోయే కాలంలో ఆదుకునేది తెలంగాణ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందేలా చూస్తామని, ఎవరూ దిగులు పడొద్దని భరోసా ఇచ్చారు.చొప్పదండి మండలంలోని వెదురుగట్ట, చాకుంట, భూపాలపట్నం గ్రామాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను బుధవారం ఆయన పరిశీలించారు. బాధిత రైతులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. రామడుగు మండలం పందికుంటపల్లి అనుబంధ గ్రామం కురుమపల్లిలో వడగండ్ల వానకు గోడకూలి 17 గొర్రెలు మృతి చెందగా, బాధితులను పరామర్శించారు. అనంతరం సమీపంలోని దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ఎమ్మెల్యే మాట్లాడారు. వడగండ్ల బాధితులకు తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ నెలరోజుల క్రితం రామడుగు మండలం వచ్చి రైతులను పరామర్శించి ఓదార్చారని, దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ ప్రకటించని విధంగా ఎకరానికి 10 వేల నష్టపరిహారం ప్రకటించారని కొనియాడారు. చొప్పదండి నియోజకవర్గంలో వడగండ్ల వానకు నష్టపోయిన 4 వేల మంది రైతుల 3,500 ఎకరాలకు సుమారు 3 కోట్ల 50 లక్షలు పది రోజుల్లో వారి ఖాతాల్లో జమవుతాయని చెప్పారు.
ఇప్పుడు నష్టపోయిన రైతుల పంటలకు సంబంధించి సర్వే చేయించి, అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కొయ్యని పంటలు సర్వే చేసి వివరాలు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. దొంగలు పడ్డంక కుకలు మొరిగినట్టు బండి సంజయ్ మొసలి కన్నీరు కారుస్తున్నాడని, రైతులకు మాయమాటలు చెప్పుతూ తప్పుదోవ పట్టిస్తున్నాడని ఎద్దేవా చేశారు. కేంద్రం ఎలా ఆదుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం నిర్మించిన కల్లాల నిధులు 150 కోట్లను కేంద్రం వాపస్ తీసుకున్నదని, దీనికి బండి సంజయ్ సమాధానం చెప్పాలని నిలదీశారు. రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి 40 వేల నష్టపరిహారం ఇప్పించాలని, అలా చేస్తే రైతుల పక్షాన బండి సంజయ్ చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తామని సవాల్ విసిరారు. ఆయన వెంట చొప్పదండి మండలంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మల్లారెడ్డి, మారెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుకారెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ గుడిపాటి వెంకట రమణారెడ్డి, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్ గౌడ్, సర్పంచ్ పెద్ది శంకర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు మాచర్ల వినయ్ కుమార్, గుడిపాటి చిన్న, ఏలేటి తిరుపతిరెడ్డి, మారం యువరాజ్, శ్రీనివాస్, మాధవరెడ్డి, ఏఈవో వంశీకృష్ణ.. కురుమపల్లిలో ఏఎంసీ చైర్మన్ మామిడి తిరుపతి, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, ఏఎంసీ డైరెక్టర్ కొడిమ్యాల రాజేశం, సర్పంచు మొగుల్ల ఎల్లయ్య ఉన్నారు.