కోరుట్ల, జనవరి 25 : కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నదని, సొంత పాలసీ లేకుండా పాలన సాగిస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధ్వజమెత్తారు. కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక సాకుతో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు గ్రామ, వార్డు సభలను నిర్వహిస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ మంత్రులు పథకాల అమలు తీరుపై తలా తోక లేకుండా ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కొత్త నాటకానికి తెర లేపారన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల వద్దకు పాలన తీసుకు వెళ్లారని, ఒక్కసారి కూడా దరఖాస్తుల పేరుతో ప్రజలను ఇబ్బందులు పెట్టిన దాఖలాలు లేవన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ ఆరున్నర లక్షల మందికి రేషన్ కార్డులు అందజేసిందని, అవసరమైతే ప్రభుత్వ లెక్కలు చూసుకోవాలని సూచించారు. రాష్ట్ర మంత్రులు అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని, గత ప్రభుత్వంపై నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాల అమలు పేరుతో ప్రజలను మభ్య పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆరోపించారు. పథకాల కోసం కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇల్లు ఇప్పిస్తామని 10 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరు కూడా డబ్బులు ఇవ్వవద్దని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించే బాధ్యత తనదేనని భరోసా కల్పించారు.
తెలంగాణ ప్రజలు శాసించి పథకాలను సాధించుకోవాలని, ఎవరి వద్దా మోకరిల్లి యాచించవద్దన్నారు. గ్రామ సభలు పార్టీ సభలుగా మారాయని, ప్రశ్నించే వారిపై రౌడీయిజం, గుండాయిజం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో రైతు బంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చీటి వెంకటరావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు ఫహీం, నాయకులు అతిక్, మురళి, అన్వర్, సందయ్య, రాజ్‌కుమార్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.