రాయికల్, మార్చి 14 : రైతుల కోసం ఇన్ని పథకాలు ప్రవేశపెడుతూ వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తు న్న ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను పదేపదే విమర్శించడమే ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పనిగా పెట్టుకున్నారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మండిపడ్డారు. రైతుల సంక్షేమం కోసం ఏ ప్రభుత్వాలు చేయని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెపెట్టిన సీఎం కేసీఆర్ వారి పక్షపాతిగా నిలిచారని కొనియాడారు. రాయికల్ పట్టణంలోని జడ్పీటీసీ జాదవ్ అశ్విని గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. జగిత్యాల నియోజకవర్గంలో ఒకప్పుడు 20వేల ఎకరాల్లో వరి పంట సాగయ్యేదని, నేడు 58,946 ఎకరాల్లో వరి సాగవుతున్నదన్నారు.
40ఏండ్ల కింద సాగు నీటి కోసం కాల్వలు తవ్వారని, ఎన్నో ప్రభుత్వాలు మారినా ఏ నాడూ 25వేల ఎకరాలకు సాగు దాటలేదన్నారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టడంతో భూగర్భ జలాలు పెరుగడమే కాకుండా ఎండాకాలంలో సైతం నీరు ఉండే స్థితికి చేరిందన్నారు. ఎక్కడో ఏదో ఒక చిన్న సమస్యను పట్టుకొని గోరంత విషయాన్ని కొండంతగా చూపిస్తూ జీవన్‌రెడ్డి ప్రచార లబ్ధిపొందాలని చూస్తున్నారని విమర్శించారు. నిజంగానే రైతులకు నీళ్లందని, కరంటు లేని పక్షంలో ఇన్ని వేల ఎకరాల్లో ఎలా పంటలు సాగు చేస్తున్నరో జీవన్‌రెడ్డి చెప్పాలని నిలదీశారు. నియోజకవర్గంలో 58946ఎకరాల్లో వరి సాగయితే, 46 ఎకరాల్లోనైనా వరి ఎండిపోయిందో చూపిస్తారా..?అని ప్రశ్నించారు.
ప్రతీ నీటి బొట్టునూ ఒడిసి పట్టేలా రాయికల్ మండలం మైతాపూర్ నుండి బోర్నపెల్లి వరకు చెక్ డ్యాంలు నిర్మించామన్నారు. తొంబర్రావుపేట కెనాల్ వద్ద తూము అమర్చి రాయికల్‌లోని చెరువులను నింపామన్నారు. నియోజకవర్గంలో ఒకప్పుడు పదివేల ఎకరాల వరకు పసుపు పంట సాగైతే నేడు 2వేల ఎకరాలకు పడిపోయిందన్నారు. ఆనాడు కాంగ్రెస్, నేడు అధికారంలో ఉన్న బీజేపీ విధానాల వల్లే పసుపు రైతులకు ఇలాంటి దుస్థితి నెలకొందన్నారు. పసుపు బోర్డు తెస్తానని అరవింద్ రైతులు బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేశాడన్నారు. పసుపు ధర ఘోరంగా పతనమైనా, కాటన్ కార్పొరేషన్‌ను ఎత్తేసినా, ఉపాధి హామీ పథకాలను కేంద్రం నిర్వీర్యం చేస్తున్నప్పటికీ జీవన్ రెడ్డి ఏ నాడూ ప్రెస్ మీట్ పెట్టి కేంద్రాన్ని కాని, ఎంపీ అరవింద్‌ను కాని ప్రశ్నించిన పాపనపోలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు కలిసి పనిచేయబోతున్నాయని, ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు, జడ్పీటీసీ సభ్యురాలు జాదవ్ అశ్విని, రైతు బంధు సమితి మండల కన్వీనర్ మోహన్‌రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ రమాదేవి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజేశ్, సర్పంచులు శ్రీనివాస్‌గౌడ్, నందు నాయక్, నాయకులు కొత్తపెల్లి ప్రసాద్, గంగారాం తదితరులు పాల్గొన్నారు.