సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన మానకొండూర్ నియోజకవర్గం స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. తలాపున మానేరు ఉన్నా తాగు, సాగునీటికి తండ్లాడిన ఈ ప్రాంతం నేడు పుష్కలమైన నీటితో కళకళలాడుతున్నది. గుంతలు పడి, కంకర తేలి అష్టకష్టాలు పడ్డ ప్రతి ఊరూ బీటీరోడ్లతో మెరిసిపోతున్నది. ఎక్కడికక్కడ బ్రిడ్జిలను నిర్మించుకొని ఏళ్ల నాటి కష్టాలను దూరం చేసుకొన్నది. మిషన్ భగీరథతో తాగు నీటి గోస తీర్చుకున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇల్లంతకుంట మండలం అనంతగిరిలో 2,900 కోట్లతో నిర్మించిన ప్రాజెక్ట్ ఇల్లంతకుంట, బెజ్జంకి, గన్నేరువరం మండలాలను సస్యశ్యామలం చేసింది. 2,700 కోట్లతో తిప్పాపూర్ పంప్‌హౌస్‌ను (ఆసియాలోనే అతిపెద్ద సర్జ్‌పూల్) నిర్మించుకొని రికార్డులకెక్కింది. శ్రీరారాజేశ్వర జలాశయం నుంచి 4 వేల కోట్లతో కుడికాలువను నిర్మించుకొని కాలువల ద్వారా గ్రామాలకు నీటిని సరాఫరా చేస్తున్నది. పల్లెప్రగతితో పల్లెల రూపురేఖలే మార్చింది. ఇలా ఒకటేమిటి సీఎం కేసీఆర్ సంకల్పం, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కృషితో అన్నింటా అగ్రగామిగా నిలుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది.
తిమ్మాపూర్ రూరల్, మార్చి21 : ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల కరుణకు నోచుకోని మానకొండూర్ నియోజకవర్గం స్వరాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కుగ్రామాలుగా ఉన్న పల్లెలు ఇప్పుడు అభివృద్ధిని సాధిస్తూ ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నాయి. రైతుల కోసం సాగునీటి ప్రాజెక్టులు, చెక్‌డ్యాంల నిర్మాణం, గ్రామాల్లో మౌలిక వసతులు మొదలుకుని గ్రామాలు, మండలాలను కలుపుకునే బ్రిడ్జిల దాకా ఎంతో అభివృద్ధి సాధించింది. వేల కోట్ల నిధులతో పల్లెలు పరిశుభ్రంగా మారడంతోపాటు జరిగిన అభివృద్ధి కండ్ల ముందే కనిపిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇల్లంతకుంట మండలం అనంతగిరిలో నిర్మించిన ప్రాజెక్టుతో నియోజకవర్గంలోని బెజ్జంకి, గన్నేరువరం, ఇల్లంతకుంట మండలాలు సస్యశ్యామలంగా మారుతున్నాయి. కరువు కాటకాలతో అల్లాడిన ఈ మండలాల్లో ఇపుడు చూద్దామన్నా ఆ చాయలు కనిపించడం లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా రెండు సార్లు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ప్రత్యేకంగా నిధులు సాధిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు.
మెరుగైన విద్యుత్ వ్యవస్థ
నాడు మానకొండూర్ నియోజకవర్గ రైతులు విద్యుత్తు సమస్యలతో నిత్యం సతమతమయ్యేవారు. మెట్ట ప్రాంతాలైన తిమ్మాపూర్, బెజ్జంకి, గన్నేరువరం, ఇల్లంతకుంట మండలాల్లోని రైతులకు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉండేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం 24 గంటల విద్యుత్తు సరఫరా కోసం లైన్లను బలోపేతం చేసింది. అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసింది. శంకరపట్నం మండలం కాచాపూర్, ఎరడపల్లి, గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ 25 కోట్లతో కొత్తగా 33/11 విద్యుత్తు ఉప కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంత రైతులకు విద్యుత్తు సమస్యలు లేకుండా పోయాయి. మరి కొన్ని కొత్త విద్యుత్తు ఉప కేంద్రాలకు ప్రతిపాదనలు చేశారు.
పేదల సొంతింటి కల సాకారం
నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నది. నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలం పోలంపల్లిలో 9, తిమ్మాపూర్‌లో 50, అల్గునూర్‌లో 16 చొప్పున 3.77 కోట్లతో 75 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్నారు. బెజ్జంకిలో 48, తోటపల్లిలో 30, మరో గ్రామంలో 20 చొప్పున 4.92 కోట్లతో 98 ఇండ్లు నిర్మిస్తున్నారు. ఇల్లంతకుంట మండలం కంది కట్కూర్లో 48, పొత్తూరులో 32, పెద్ద లింగాపూర్‌లో 40, ఒబులాపూర్‌లో 24, ఇల్లంతకుంటలో 40 చొప్పున 9.25 కోట్లలో 184 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్నారు. స్థలాలు ఉన్న పేదలకు ఇండ్లు నిర్మించుకునేందుకు 3 లక్షలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు పెద్ద మొత్తంలో పేదలకు ఆర్థిక సహాయం అందించేందుకు ఎమ్మెల్యే రమసయి బాలకిషన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
గడపగడపకూ సంక్షేమం
ఆసరా కింద దివ్యాంగులకు 3,016, మిగతా కేటగిరీల వారికి 2,016 చొప్పున నెలనెలా అందిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రతినెలా 39,559 మందికి 8.66 కోట్లకు పైగా ఆసరా పెన్షన్లు ఇస్తుననారు. అలాగే కల్యాణలక్ష్మి, షాదీముబారక్, పథకాల కింద ఇప్పటివరకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద 9,255 మంది పేదింటి ఆడపడుచులకు ఆర్థిక సహాయం అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 3,182 మందికి 8.56 కోట్లు ఇచ్చారు.
కరువు తీర్చిన అనంతగిరి ప్రాజెక్టు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇల్లంతకుంట మండలం అనంతగిరిలో 2,900 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టుతో నియోజకవర్గంలోని ఇల్లంతకుంట, బెజ్జంకి, గన్నేరువరం మండలాలను సస్యశ్యామలం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఏటా కరువు కాటకాలతో ప్రజలు అల్లాడేవారు. ప్రజలు తాగు నీటి కోసం రోడ్లక్కెని రోజంటూ ఉండేది కాదు. దశాబ్దాలుగా వేలాది ఎకరాలు బీళ్లుగా మారిన స్థితిలో ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతానికి వరంగా మారింది. కరువు కాటకాలు మటుమాయమై ఇపుడు ఏడాది పొడుగునా పంటలు పండిస్తూ రైతులు ఆర్థికంగా బలపడుతున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆసియాలోనే అతిపెద్ద సర్జ్‌ఫూల్ నిర్మించారు. అనంతగిరి ప్రాజెక్టుకు ఆనుకుని 2,700 కోట్లతో తిప్పాపూర్ పంప్‌హౌస్‌ను నిర్మించారు. 62 మీటర్ల ఎత్తు, 95 మీటర్ల లోతుతో నిర్మించిన ఈ సర్జ్‌పూల్ ఆసియాలోనే అతిపెద్దదిగా రికార్డుల కెక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎగువ ఎత్తిపోతలకు ఈ సర్జ్‌పూల్ సహాయపడుతున్నది. ఇక్కడి నుంచే అనంతగిరి ప్రాజెక్టుకు కాళేశ్వరం జలాలు వస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీరారాజేశ్వర జలాశయం నుంచి 4 వేల కోట్లతో కుడికాలువను నిర్మించి, తోటపల్లి రిజర్వాయర్‌కు లింక్ చేశారు. ఈ రిజర్వాయర్‌లో టీఎంసీ నీటిని ఎల్లవేళలా అందుబాటులో ఉంచుతున్నారు. నియోజకవర్గంలోని తిమ్మాపూర్, గన్నేరువరంలోని పలు గ్రామాలతోపాటు హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో అనేక గ్రామాలకు సైతం కాలువల ద్వారా నీటిని సరాఫరా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు ఇప్పుడు సాగు నీటి సదుపాయం కలిగింది. కరువు తీరి రైతులు పుష్కలంగా పంటలు పండించుకుంటున్నారు.
స్ఫూర్తిదాయకంగా పల్లె ప్రగతి
పల్లెలతో విస్తరించి ఉన్న మానకొండూర్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సంపూర్ణంగా వినియోగించుకుని ప్రగతిలో పరుగులు పెడుతున్నాయి. ఒకప్పుడు అభివృద్ధి అంటే ఎరుగని పల్లెలు ఇప్పుడు ప్రగతి బాటలో నడుస్తున్నాయి. హరితహారం కార్యక్రమంతో ప్రతిపల్లె పచ్చని చెట్లతో కళకళలాడుతున్నది. వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలను ఊరూరా నెలకొల్పి ప్రతి పల్లెను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ఇప్పుడు పారిశుధ్యానికి చిరునామాగా మారింది. పల్లె ప్రగతి స్ఫూర్తిని అందిపుచ్చుకున్న కొన్ని గ్రామాలైతే ఊహించని రీతిలో అభివృద్ధి చెందాయి. జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకున్నాయి. ప్రతి గ్రామానికి ట్రాక్టర్ ఇవ్వడంతో చెత్తా చెదారాన్ని ఎప్పటికప్పుడు డంప్ యార్డులకు తరలిస్తున్నారు. ఫలితంగా ప్రతి పల్లెలో పారిశుధ్యం మెరుగైంది. ఈ పథకం కింద 143 శ్మశాన వాటికలకు 16.30 కోట్లు, మరో 143 సెగ్రిగేషన్ షెడ్లకు 3.71 కోట్లు ఖర్చు చేశారు. 12 కోట్లు ఖర్చు చేసి 60 కొత్త గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించారు. 109 మహిళా సంఘాల భవనాలకు 30 కోట్లు వెచ్చించారు.
రైతులకు అండగా
రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నది. రైతుబంధు కింద ప్రతి సీజన్లో 80,006 మంది రైతులకు 85.49 కోట్లు పెట్టుబడి సహాయంగా అందిస్తున్నది. రైతుబీమా కింద ఇప్పటివరకు మరణించిన 851 మందికి 42.55 కోట్ల బీమా పరిహారం ఇచ్చింది. ప్రతి క్లస్టర్‌కు ఒకటి చొప్పున నియోజకవర్గంలో 7 కోట్లతో రైతు వేదికలు నిర్మించారు. రైతులకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నారు. ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు జరిపి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నది.
ఎంతో అభివృద్ధి చేశాం
నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవడానికి వేల కోట్ల నిధులతో ఎన్నో పనులు చేసినం. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో వందల పనులు చేసినం. ప్రజలకు ఎక్కడ ఎవరికి ఏం కావాలో ఆ ప్రాజెక్టులు, పనులు పూర్తయినయ్. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఎకరాకు నిరందించేందుకు కాలువల ద్వారా కాళేశ్వర జలాలు ఇస్తున్నం. యాసంగిలో ఇప్పటి వరకు ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా నీళ్లిస్తున్నం. ఇది చరిత్రలో ఎప్పుడూ జరగని పని చేసినం. రైతులతో పాటూ, సబ్బండ వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. ప్రజలు మమ్మల్ని మళ్లీ ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నరు.
-డాక్టర్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే, మానకొండూర్
విద్య వ్యవస్థ బలోపేతం
రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థ బలోపేతమైంది. మానకొండూర్ నియోజకవర్గంలో అనేక విద్యా వ్యవస్థలను నెలకొల్పి అన్ని వర్గాల్లోని బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తున్నది. తిమ్మాపూర్ మండలంలో మైనార్టీ రెసిడెన్షియల్, బీసీ రెసిడెన్షియల్, ఇల్లంతకుంట, బెజ్జంకిలో ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసింది. తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్‌లో గతంలో ఏర్పాటు చేసిన బాలికల రెసిడెన్షియల్ పాఠశాలకు పక్కా భవనాన్ని నిర్మించింది. మానకొండూర్ మండలం దేవంపల్లిలో సోషల్ వెల్ఫేర్, ఇదే మండలం పోచంపల్లి, శంకరపట్నంలో మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేశారు. మన ఊరు మన బడి పథకం కింద నియోజకవర్గంలోని 85 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు 10 కోట్లు మంజూరు చేసింది.
మిషన్ కాకతీయతో జలకళ
ఉమ్మడి రాష్ట్రంలో ఏ చెరువును చూసినా గండ్లు పడి, పూడికతో నిండి, చెట్లు, పిచ్చి మొక్కలతో అస్తవ్యస్థంగా కనిపించేవి. మిషన్‌కాకతీయతో ప్రస్తుతం పెద్ద సంఖ్యలో చెరువుల పునరుద్ధరణ తర్వాత ప్రతి చెరువు నీటితో కళకళలాడుతున్నది. నాలుగు విడుతల్లో 138.38 కోట్లతో 365 చెరువులను పునరుద్ధరించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చొరవతో అనేక చెరువులను కాలువల ద్వారా నీళ్లు తెచ్చి నింపుతున్నారు. దీంతో నిండు వేసవిలో కూడా అనేక చెరువులు మత్తళ్లు దుంకుతూ కనిపిస్తున్నాయి. శంకరపట్నం మండలం గద్దపాక, కేశవపట్నం, అర్కండ్ల గ్రామాల్లో చెక్ డ్యాంలు నిర్మించేందుకు 16.31 కోట్లు, మానకొండూర్ మండలాల్లోని లక్ష్మీపూర్, వేగురుపల్లి లో 39.48 కోట్లతో చెక్ డ్యాంలు నిర్మిస్తున్నారు. ఫలితంగా ఒకప్పుడు మెట్ట ప్రాంతమైన మానకొండూర్‌లో ఇపుడు ఎక్కడ చూసినా భూగర్భ జలాలు పైకి వచ్చి రైతుల సేద్యానికి తోడ్పాటును అందిస్తున్నాయి.
అరుంధతి కల్యాణ మండపాలు
పేదోళ్ల పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో అరుంధతి కల్యాణ మండపాలను నిర్మిస్తున్నారు. ఇందుకు 3.70 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వీటిని రూపకల్పన చేసిన ఎమ్మెల్యే ప్రతీ మండలంలోని పేదలు, సబ్బండవర్గాలకు అందుబాటులోకి తెస్తున్నారు.
మట్టి రోడ్లు మాయం
ఒకప్పుడు ఏ ఊరికి వెళ్లినా మట్టి రోడ్లు, లేదంటే కంకర తేలిన రోడ్లే కనిపించేవి. ఈ రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా ఉండేది. ఇప్పుడు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా బీటీ రోడ్లే కనిపిస్తున్నాయి. రోడ్ల వెడల్పు కార్యక్రమం తీసుకుని గ్రామాల నుంచి ప్రతి మండల కేంద్రానికి వెళ్లే రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చారు. గతంలో నిధులు లేక కనీస మరమ్మతులకు నోచుకోని అనేక రోడ్లకు ఇప్పుడు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తున్నారు. 60 కోట్లతో ఆర్అండ్బీ రోడ్లు, రూ.38 కోట్లతో పంచాయతీ రాజ్ రోడ్లను అభివృద్ధి చేశారు. గ్రామాల్లో అంతర్గత రోడ్లను సీసీగా మారుస్తున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే నియోజకవర్గంలోని సీసీ రోడ్లకు 26.20 కోట్లు మంజూరు చేయించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ యుద్ధప్రాతిపదికన వాటి నిర్మాణాలు పూర్తి చేసేలా పర్యవేక్షిస్తున్నారు. మానకొండూర్ మండలం వేగురుపల్లి, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల మధ్యనున్న మానేరు వాగుపై గతంలో వంతెన లేక ఈ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వానకాలంలో మానేరు వాగు ప్రవహిస్తే కరీంనగర్ మీదుగా నీరుకుల్ల వెళ్లే పరిస్థితి ఉండేది. ఇప్పుడు 40. 20 కోట్లతో అద్భుతమైన వంతెన నిర్మించారు. ఫలితంగా నీరుకుల్ల మీదుగా పెద్దపల్లి జిల్లాకు వెళ్లే ఈ ప్రాంత ప్రజలకు రాకపోకలు సులువయ్యాయి.
నాకు మందులకు పని చేస్తన్నయ్..
నేను 15 ఏండ్ల కింద ప్రమాదవశాత్తు బావిలో పడడంతో తీవ్ర గాయాలై కుడి చేయి సరిగ్గా పని చేయదు. కాలు కూడా నొప్పులుంటాయి. దీంతో ఏ పని చేయకపోతుంటిని. దీంతో గతంలో పింఛన్ ఐప్లె చేసుకుంటే తక్కువ వచ్చేది. ఇగ సీఎం కేసీఆర్ అయినంక నాకు 3వేల ఫించన్ అత్తంది. గతంలో మందులకు ఇబ్బందయ్యేది. ఇప్పుడు ఈ పైసలతోని మందులు తెచ్చుకుంటన్న, ఇంకా చిల్లర ఖర్చు ఎల్తంది. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంట.
– ఆవుల అయిలయ్య, ఆసరా లబ్ధిదారు, రామకృష్ణ కాలనీ (తిమ్మాపూర్ మండలం)
కల్యాణలక్ష్మి కొండంత ధైర్యమిచ్చింది
మాది నిరుపేద కుటుంబం. పని చేసుకుంటేనే పూట గడుస్తది. మాకు ఇద్దరు బిడ్డ కవిత, సుమ. బిడ్డల పెండ్లి ఎట్ల జేసుడని మస్తు రందయితుండె. కానీ సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టినంక ధైర్యంగా పెండ్లి జేసిన. కల్యాణలక్ష్మి పైసలు పెండ్లి ఖర్చులకు ఎంతో ఉపయోగపడ్డయి.
-పారునంది లక్ష్మి, లబ్ధిదారు, మన్నెంపల్లి
నా ఇద్దరు బిడ్డలకు కల్యాణలక్ష్మి అచ్చింది
నాకు ఇద్దరు బిడ్డలు స్వప్న, రమ్య, ఒక కొడుకు ఉన్నరు. కట్టపడి పెద్దబిడ్డ స్వప్న పెండ్లి జేసినంక కొన్నొద్దులకే చిన్నబిడ్డ రమ్యకు కూడా పెండ్లి దొరింపైంది. ఇద్దరు బిడ్డలకు ఒక్కటేసారి పెండ్లి చేసేటల్లకు పైసలెట్ల అని మస్తు రందైంది. పెద్దబిడ్డ పెండ్లి చేసినంక కల్యాణలక్ష్మికి దరఖాస్తు పెట్టుకున్న. మల్ల చిన్నబిడ్డ పైండ్లెనంక కూడా మల్ల ఐప్లె చేసుకున్న కొన్నొద్దులకే ఎమ్మెల్యే రసమయి సారు.. మా ఇంటికే చెక్కు పట్కచ్చి, చీరె పెట్టి ఆడబిడ్డలను దీవించిండు. నాకు మస్తు సంబురమైంది. ఎంత తిరుగుడైతదోనని భయమయిండే. కనీ ఎసొంటి ఇబ్బంది లేకుంట సార్లు అందజేసిర్రు. అందరికి రుణపడి ఉంటం.
-గట్టు రాధ, కొండపల్కల (మానకొండూర్)
నాకు గిరాకీ పెరిగింది..
నాకు చిన్నప్పటి నుంచే కాలు సరిగ్గా పని చేయదు. దీంతో చిన్నతనంలోనే గ్రామంలోనే ఫొటో స్టూడియోనే పెట్టుకుని జీవిస్తున్న. అరకొర వసతులతో నడుస్తున్న స్టూడియోకు గిరాకీ తక్కువగా వచ్చేది. కనీ, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సార్ దళితబంధు ఇప్పించిన్రు. దీంతో నా స్టూడియోకు కావాల్సిన హైక్వాలిటీ కెమెరాలు, ఇతర పరికరాలు తెచ్చుకున్న. ఇప్పుడు నేను మార్కెట్‌తో పోటీ పడి ప్రోగ్రాంలు చేసుకుంటున్న. నాకు దళిత బంధు ఇచ్చిన ప్రభుత్వానికి, ఇప్పించిన ఎమ్మెల్యేకు రుణపడి ఉంటం. – కొమ్ము సంపత్, దళితబంధు లబ్ధిదారు, మొగిలిపాలెం (తిమ్మాపూర్)