MLA Padi Kaushik Reddy | వీణవంక, డిసెంబర్ 18 : హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Kaushik Reddy) స్వగ్రామం వీణవంకలో బీఆర్ఎస్ హవా కొనసాగింది. ఈ నెల 17న జరిగిన మూడో విడత సర్పంచ్ ఎన్నికలల్లో భాగంగా వీణవంక గ్రామ పంచాయతీలో 12 వార్డులకు గాను 10 వార్డులు బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో పాటు సర్పంచ్ అభ్యర్థి దాసారపు సరోజన విజయం సాధించడంతో బీఆర్ఎస్ విజయ దుందుభి మోగించింది.
196 ఓట్ల మెజార్టీతో సర్పంచ్ విజయం సాధించగా, అత్యధికంగా ఆరో వార్డులో 107 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్లపెల్లి మహేష్ గౌడ్ వార్డుమెంబర్‌గా గెలుపొంది ఉపసర్పంచ్ పదవి కైవసం చేసుకున్నారు. స్వగ్రామంతో పాటు మండలంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 10 మంది గెలుపొంది సత్తాచాటారు. దీంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటి ఆవరణలో బాంబులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు.
స్థానిక మహిళలు, చిన్నారులు, పురుషులతో కలిసి ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే నృత్యం చేసి వారిలో ఉత్సాహం నింపారు. వీణవంక గడ్డ బీఆర్ఎస్ అడ్డా అంటూ నినాదాలు చేస్తూ ఆడిపాడి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాసారపు సరోజన-రాజేంద్రప్రసాద్, ఉపసర్పంచ్ తాళ్లపెల్లి మహేశ్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ వోరెం భానుచందర్, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.