జమ్మికుంట, ఫిబ్రవరి16 : జమ్మికుంట బల్దియాపై మరోసారి గులాబీ జెండా ఎగిరింది. అధికార కాంగ్రెస్ పార్టీ కుట్రలు.. కుతంత్రాలను భగ్నం చేస్తూ.. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తనదైన శైళిలో చక్రం తిప్పారు. ఎక్స్ అఫీషియో ఓటుతో మెజార్టీ సభ్యుల మద్దతు సాధించారు. చైర్మన్‌గా మొలుగు ప్రశాంత్‌కుమార్, వైస్ చైర్మన్‌గా ముంతాజ్ అలీ అహ్మద్(జావిద్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 30 వార్డులున్న జమ్మికుంటలో బీఆర్ఎస్కు 12 మంది, స్వతంత్రులు ముగ్గురు, ఏఐఎఫ్బీ నుంచి ఒక్కరు విజయం సాధించారు. అయితే, స్వతంత్రులలో ఇద్దరూ బీఆర్ఎస్కు చెందిన వారే రెబల్‌గా గెలిచారు.
అయితే.. బీఆర్ఎస్ 12, స్వతంత్రులతో కలిస్తే 15 మంది అవుతారు. ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటుతో చైర్మన్ పీఠం దక్కుతుందని భావించిన కాంగ్రెస్.. ఇండిపెండెంట్లతోపాటు మరో బీఆర్ఎస్ సభ్యురాలిని కా్ంయపునకు తరలించినట్టు ప్రచారం ఉంది. చైర్మన్ పీఠం మాదేనని.. ధీమాతో ఉన్నారు. కానీ, ఎమ్మెల్యే ఇక్కడే కాంగ్రెస్ ఎత్తులను చిత్తు చేశారు. ఏం చేశారో.. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ఇండిపెండెంట్లు ముగ్గురు, బీఆర్ఎస్ సభ్యురాలు యూ టర్న్ తీసుకున్నారు. ఎమ్మెల్యే వద్దకు వచ్చారు. మద్దతు పలికారు.
జమ్మికుంట మున్సిపల్‌పై గులాబీ జెండా ఎగురవేస్తమని ముందే చెప్పినం. కేసీఆర్ నాయకత్వంలో బరాబర్ జెండా ఎగురవేసినం. చైర్మన్‌గా మొలుగు ప్రశాంత్‌ను, వైస్ చైర్మన్‌గా ముంతాజ్ అలీ అహ్మద్‌ను ఎన్నుకున్నం. కచ్చితంగా జమ్మికుంటను అభివృద్ధి చేసింది కేసీఆర్ నాయకత్వమే. కోట్లాది రూపాయల నిధులు ఇచ్చిన్రు. అభివృద్ధి చేసిన్రు. రాబోయే రోజుల్లో మున్సిపల్‌ను మరింత గొప్పగా అభివృద్ధి చేస్తం. చూపిస్తం. బీఆర్ఎస్ పక్షాన నిలిచిన ఓటర్లకు కృతజ్ఞతలు.
– పాడి కౌశిక్‌రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే