హుజూరాబాద్, సెప్టెంబర్ 12 : హుజూరాబాద్ పట్టణంలో వరదలతో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం హుజూరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలను సందర్శించి, బాధితుల సమస్యలు తెలుసుకున్నారు. పట్టణంలోని రెడ్డి కాలనీ, బుడిగ జంగాల కాలనీ, మామిండ్లవాడ, గాంధీ నగర్‌లోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి తెలుసుకున్నారు. అలాగే, గుల్ల చెరువు వద్దకు వెళ్లి నీటి మట్టాన్ని పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ, వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడొద్దని మున్సిపల్ అధికారులను ముందస్తుగానే అప్రమత్తం చేశామని, భారీగా ఆస్తి నష్టం జరుగకుండా ఉండేందుకు సహాయక చర్యలు తీసుకున్నామని తెలిపారు. వర్షంతో నష్టపోయిన కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఇకడి పరిస్థితిపై కలెక్టర్ పమేలా సత్పతికి సమాచారం అందించామన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ గందె శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు తిరుమల్ రెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్, కిషన్, కోండ్ర నరేశ్, ఇమ్రాన్, మేనేజర్ భూపాల్‌రెడ్డి, అధికారులు, కార్యకర్తలు ఉన్నారు.