గోదావరిఖని, ఏప్రిల్ 18: ‘కాంగ్రెస్‌కు ఒక విజన్ లేదు. ప్రజా సంక్షేమం అవసరం లేదు. కేవలం అధికార దాహం తప్ప ఏం చేయాలో ఒక ప్రణాళిక లేదు. 60 ఏండ్లు దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించి ఏం చేసింది? మొత్తం భ్రష్టు పట్టించింది’ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ రాబోయే ఎన్నికల్లో కనీసం డిపాజిట్నైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ పాదయాత్రలు మొదలు పెట్టిందని మండిపడ్డారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వారి పాలనలో రాష్ర్టానికి ఒరిగిందేమీలేదన్నారు. కాలువల్లో, చెరువుల్లో నీళ్లు లేక తెలంగాణ నేల నెర్రెలు వాసిందన్నారు. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి ఎకరాకు సాగునీరందుతూ తెలంగాణ సస్యశ్యామలంగా వర్ధిల్లుతున్నదని చెప్పారు. చంపిన వాళ్లే సంతాప సభ పెట్టినట్టుగా తమ పాలనలో తెలంగాణను సర్వనాశనం చేసినవాళ్లే ఇప్పుడు అభివృద్ధి గురించి ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
బీపీఎల్ ఎవరి హయాంలో ప్రతిపాదించారో.. నిర్మాణం కాకపోవడానికి కారణమెవరో చెప్పాలని ప్రశ్నించారు. ప్రాజెక్టులు, పరిశ్రమల పేరుతో రైతుల నుంచి వ్యవసాయ భూములను తీసుకొని మార్కెట్ విలువకు తగిన ధర చెల్లించలేదన్నారు. ఏ పవర్‌హౌస్ మూసివేతకు, బీపవర్ హౌస్ మూసేసే పరిస్థితికి కాంగ్రెస్ కారణం కాదా..? చెప్పాలని ప్రశ్నించారు. రామగుండం ప్రాంతాన్ని బొందల గడ్డగా చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని, స్పిన్నింగ్, వీవింగ్ మిల్లుల గొంతు కోసి కాందిశీకుల ఆకలి చావులకు, ఆత్మహత్యలకు కారణమైన చరిత్ర మీది కాదా..? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రామగుండం అభివృద్ధి, సంక్షేమం కోసం పాదయాత్ర చేసే నైతిక హక్కు వారికి లేదన్నారు. 15 ఏళ్ల పాటు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నది కాంగ్రెస్సేనన్నారు. రాజకీయ అత్యవసర పరిస్థితికి యాత్ర చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని, సింగరేణిలో లక్షా 20వేల మంది కార్మికుల సంఖ్య 60వేలకు పడిపోవడానికి వాళ్లే కారణమన్నారు. కేవలం ప్రభుత్వాన్ని బదనాం చేసి, రాజకీయ పబ్బం గడుపుకోవడానికే అసత్య ప్రచారం చేస్తూ పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. ఇక్కడ మేయర్ బంగి అనిల్‌కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, సదానందం, రమణారెడ్డి, బాల రాజ్‌కుమార్, కృష్ణవేణి, నాయకులు శంకర్ గౌడ్, అచ్చవేణు, మురళీధర్ రావు, వాసంపల్లి ఆనంద్‌బాబు, జేవి రాజు, సంజీవ్, పర్లపల్లి రవి, మారుతి, నూతి తిరుపతి, పిల్లి రమేశ్, బెందె నాగభూషణం గౌడ్ ఉన్నారు.