కోరుట్ల, నవంబర్ 5: రైతులకిచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధ్వజమెత్తారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుదామని, ఈ నెల 12న రైతులతో కలిసి కోరుట్ల నుంచి జగిత్యాల కలెక్టరేట్ వరకు చేపట్టే పాదయాత్రను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. మంగళవారం కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాదయాత్ర విజయవంతంపై బీఆర్ఎస్ నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవంతంగా అమలు చేసిన అన్ని రైతు సంక్షేమ పథకాలను ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి వెనక్కి తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఆగస్ట్ 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తానని చెప్పి కేవలం 40శాతమే మాఫీ చేశారని దుయ్యబట్టారు. రైతుబంధు, రైతుభరోసా పథకాలను అమలు చేయడంలో విఫలమయ్యారని, రైతులు పండించిన వడ్లకు 500 బోనస్ ఇస్తామని మోసం చేశారని విమర్శించారు.
ఈ నెల 12న చేపట్టే పాదయాత్రలో రైతులు, యువకులు, మేధావులు కలిసికట్టుగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో రైతు బంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చీటి వెంకట్రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, మాజీ ఎంపీపీ తోట నారాయణ, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు ఫహీం, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.