కార్పొరేషన్ మార్చి 20 : కరీంనగర్ రూరల్ మండలానికి డీ 89 కాలువ ద్వారా వారబందీ ప్రకారం రావాల్సిన వాటా సాగునీరు(Irrigation water,) రాకపోతే రెగ్యులేటర్ గేట్లను ఎత్తివేస్తామని, అవసరమైతే పగులకొడుతామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా నుంచి గొప్ప మంత్రులు ఉన్నారు. ఈ బడ్జెట్లో ఏమైనా తీసుకువస్తారని ఆశించామని కానీ, జిల్లాకు బడ్జెట్లో సున్నా నిధులు తీసుకువచ్చారని ఆరోపించారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకతీయ కాలువ 116 క్రాస్ జంక్షన్ సాగునీటి సరఫరాలో సమన్యాయం పాటించకపోతే ఊరుకునేది లేదన్నారు. ఈ జంక్షన్ వద్ద అధికారులు సమన్వయం పాటించకపోవటం వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. జిల్లాలో పాలన నడుస్తుందా అని ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి బీఆర్ఎస్ పాలనలో ప్రతి రాష్ట్ర బడ్జెట్లో కరీంనగర్ జిల్లా పేరు లేకుండా ఎప్పుడు చూడలేదన్నారు. ప్రతి ఏటా ఏదో ప్రాజెక్టుకు నిధులు తీసుకువచ్చామని గుర్తు చేశారు. కరీంనగర్ రాష్ట్రంలో భాగం కదా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే నిధులు రావా అని నిలదీశారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 మంజూరు చేస్తే కనీసం కరీంనగర్‌కు ఒక్కటి కూడ ఇవ్వలేదన్నారు. గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా ఉంటే మంజూరు చేయారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలులోకి వచ్చినప్పుడు తాము సంతోషిస్తామన్నారు. బడ్జెట్లో బీసీలకు ఎక్కడ నిధులు కేటాయించారని ప్రశ్నించారు. కాంట్రాక్టు పనుల్లో బీసీలకు కేటాయిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ అమలు ఎక్కడ పోయిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన పనులో ఒక్కటి కూడ బీసీలకు ఇచ్చారా అని నిలదీశారు. నగరంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ది పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ నగరానికి సీఎం ఆక్యూరెన్స్ కింద రూ.350 కోట్ల తీసుకువచ్చి పనులు చేపట్టామని, 2023 డిసెంబర్ వరకు ఈ పనులు సాగాయని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయని పేర్కొన్నారు. అద్భుతంగా అభివృద్ధి పథంలో సాగుతున్న నగరాన్ని కాంగ్రెస్ పాలనలో వెనకపడేశారని విమర్శించారు. సాగునీరు అందించే విషయంలో విఫలం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం తాగునీటి విషయంలోనైనా ముందుగానే తగు చర్యలు చేపట్టాలన్నారు. మానేరు నదిపై చేపట్టి కొనసాగుతున్న మానేరు రివర్ ఫ్రంట్ పనులకు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చూపారన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ పనులు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు హరిశంకర్, కొత్తపెళ్లి మాజీ చైర్మన్ రుద్రరాజు, తదితరులు పాల్గొన్నారు.