కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 9 : కరీంనగర్ ఎస్సారార్ కళాశాల మైదానంలో ఈనెల 12న నిర్వహించే కదనభేరి సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. ఈ సభకు వచ్చే వారికి ఎక్కడా ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు శనివారం ఆయన ఎస్సారార్ కళాశాల మైదానాన్ని శనివారం పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ, సభకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాలు, గ్రామాల నుంచి లక్షలాది సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ నుంచి 20 వేలు, మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్లల నుంచి 15 వేల చొప్పున ప్రజలు హాజరవుతున్నారని చెప్పారు. కాగా, సభకు వచ్చే ఆయా నియోజకవర్గాల ప్రజలు పార్కింగ్ చేసుకునేందుకు వీలుగా స్థలాలను గుర్తించామన్నారు.
సిరిసిల్ల, వేములవాడ, హుజూరాబాద్, హుస్నాబాద్, మానకొండూర్ నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలను సెయింట్‌జాన్స్, సెయింట్ అల్ఫోర్స్ పాఠశాలల్లో, కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలను రేకుర్తి ఈద్గా, శుభం గార్డెన్లో, అలాగే కార్లు, ఆటోలు, ఇతర చిన్న వాహనాలకు డిమార్ట్ వద్ద పార్కింగ్ స్థలాలను గుర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్‌రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, వైస్ ఎంపీపీ తిరుపతినాయక్, నాయకులు ఏనుగు రవీందర్‌రెడ్డి, పొన్నం అనిల్, శ్రీకాంత్, గందె మహేశ్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.