కొత్తపల్లి, నవంబర్ 8: కులవృత్తుల వ్యతిరేకి కాంగ్రెస్ అని, ఆ పార్టీ పాలనలో వృత్తులన్నీ ధ్వంసమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. శుక్రవారం కొత్తపల్లి మండలం ఆసీఫ్నగర్లోని బావుపేట చెరువులో ఉచిత చేపపిల్లలను విడుదల చేసి, మాట్లాడారు. కులవృత్తులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చెరువులను పునరుద్ధరించి, ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసి మత్స్య సంపదను పెంచారని గుర్తు చేశారు. ముదిరాజ్, గంగపుత్రులకు చేతి నిండా పనిదొరికి జీవితాలు బాగుపడ్డాయన్నారు. కానీ, కాంగ్రెస్ పాలనలో అన్యాయం చేస్తున్నారని వాపోయారు. ఏటా ఉచితంగా ఇచ్చే చేప పిల్లల సంఖ్యను తగ్గించి మత్స్యకారుల పొట్టకొడుతున్నారని మండిపడ్డారు.
కరీంనగర్ నియోజకవర్గంలోని 69 చెరువుల్లో గతంలో 42 లక్షల చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తే, ఇప్పుడు సగానికి తగ్గించి కేవలం 21 లక్షల పిల్లలే పంపిణీ చేయడమే అందుకు నిదర్శనమన్నారు. కరీంనగర్ ఒక్కచోటే కాదని జిల్లా వ్యాప్తంగా సగానికి తగ్గించి పంపిణీ చేస్తూ ముదిరాజ్, గంగపుత్ర కుటుంబాల పొట్టకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులవృత్తులపై ఆధారపడి జీవించే బీసీ కుటుంబాలకు సీఎం రేవంత్రెడ్డి అన్యాయం చేయవద్దన్నారు. కేసీఆర్ సర్కారు మాదిరిలా ఒక్క చేప పిల్ల తగ్గకుండా చెరువుల్లో పోయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెడ్డవేని మధు, మాజీ వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ భూక్యా తిరుపతినాయక్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు.