కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 7 : కరీంనగర్లో గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, ఇక ముందు కూడా బీఆర్ఎస్ వస్తేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రెండేళ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో నగరంలో విధ్వంసం జరుగుతుందన్నారు. శనివారం నగరంలోని 19, 20, 51, 62 డివిజన్లల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నగరానికి ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. బీజేపీ ఎంపీగా బండి సంజయ్ ఏడేళ్లుగా ఉన్నా నగరానికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని డిమాండ్ చేశారు. గత రెండున్నరేళ్లలో కేంద్రం నుంచి రెండు రూపాయలైనా నిధులు తీసుకువచ్చినట్టు జీవో చూపిస్తే తాను ముల్లెమూట సర్దుకుని పోతానని సవాల్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని తానే చేసినట్లు సంజయ్ చూపించుకుంటున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ ఒత్తిడి వల్లే కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ వచ్చిందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.వేల కోట్ల నిధులు తీసుకువచ్చి నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. రేకుర్తి ప్రాంతంలోని నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి అవసరమైతే సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేస్తామని స్పష్టం చేశారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేచినేని అశోక్‌రావు, ఎదుర్ల రాజశేఖర్, సుధగోని మాధవి కృష్ణగౌడ్, కలకొండ్ల జ్యోత్స్న, నాయకులు మల్లారెడ్డి, గంటల రేణుక, కుమ్మరి సుధాకర్, ప్రభాకర్, రవీందర్రావు పాల్గొన్నారు.