కరీంనగర్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : సునీల్‌రావు పచ్చి అవకాశవాదని, ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులో చేరడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కేవలం ఆర్థికంగా, రాజకీయంగా బలపడడానికే పార్టీలు మారుతుంటాడని ధ్వజమెత్తారు. మేయర్ సునీల్‌రావు బీజేపీలో చేరడంపై నిప్పులు చెరిగారు. ఇలాంటి వాళ్లు ఎందరు పోయినా పార్టీ ఎప్పటికీ బలంగానే ఉంటుందని, స్వార్థుపరులు పార్టీని వీడినా తమకు జరిగే నష్టం లేదని స్పష్టం చేశారు. శనివారం కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. పదేళ్లు బీఆర్ఎస్లో ఉండి, ఐదేళ్లు మేయర్ పదవి అనుభవించి, ఇప్పుడు అధికారం కోల్పోగానే బీజేపీ పంచన చేరుతున్నాడని విరుచుకుపడ్డారు.
సునీల్‌రావు ఒక స్వార్థపరుడని, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరడం, ఆ పార్టీ నాయకులను మభ్యపెట్టడం, నక్క వినయాలు ప్రదర్శించడం, రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధి పొందడం ఆయన నైజమని స్పష్టం చేశారు. తమ పార్టీలో పదేండ్లు ఉండి, మేయర్ పదవి అనుభవించి, ఆర్థికంగా బలపడ్డాడని, అధికారం కోల్పోగానే ఇంకో పార్టీని ఎంచుకుంటున్నాడని, రేపు ఆ పార్టీ అధికారం కోల్పోతే మరో పార్టీకి వెళ్తాడని ఎద్దేవా చేశారు. తన పాత కేసులు తిరగతోడకుండా చూసుకునేందుకే బీజేపీ పంచన చేరుతున్నాడని విమర్శించారు. రేపు బీజేపీ అధికారం కోల్పోతే, ఆయన నమ్ముకున్న నాయకుడి పదవి పోతే తిరిగి వేరే పార్టీలో చేరడనే గ్యారంటీ లేదన్నారు. ఎంఐఎం అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్లేందుకు కూడా వెనుకాడడని దుయ్యబట్టారు.
తమ పార్టీలో ఇక ఇలాంటి నాయకులకు అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. తమ నాయకుడు కేసీఆర్ ఎంతో మంది బలమైన నాయకులను తయారు చేశాడని, ఎందరో ఎమ్మెల్యేలు, మంత్రులుగా తయారై పరిపాలనా దక్షులుగా మారారని గుర్తు చేశారు. పార్టీ వదిలి వెళ్లిన వాళ్లంతా ఇప్పుడు కాలగర్భంలో కలిసి పోయారని చెప్పారు. సునీల్‌రావు లాంటి వెన్నుపోటు దారుల గురించి ముందే తెలిసి పోవడం చాలా మంచిదైందన్నారు. మేయర్ పదవి కోసం అక్కా, బావా అని సంబంధాలు కలుపుకొని నక్క వినినయాలు ప్రదర్శించి, పదవి రాగానే ప్రజల సంక్షేమాన్ని మరిచి రూ.కోట్లకు కోట్లు సంపాదించుకుని వెళ్లిపోవడం సునీల్రావుకే చెల్లిందని విరుచుకుపడ్డారు. ఇక నుంచి ఆయన వెంట పడక తప్పదని, ఆయనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ వెలికి తీస్తామని, ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయో మొత్తం బయటపెడతామని స్పష్టం చేశారు.
సునీల్‌రావు తమ పార్టీలోకి దొడ్డిదారిలో వచ్చినప్పుడే క్యాడర్‌ను అలర్ట్ చేశామని గంగుల గుర్తు చేశారు. ఆయన తమ పార్టీలో చేరినప్పుడే ఏదో ఒక రోజు వెళ్లి పోతాడని అప్పుడే ఊహించామని చెప్పారు. ఇరవై ఏండ్లకుపైగా కాంగ్రెస్‌లో ఉన్నాడని, ఆ పార్టీ అధికారం కోల్పోగానే తమ పార్టీలోకి వచ్చాడని, ఇప్పుడు బీజేపీలోకి వెళ్లాడని, అక్కడైనా సరిగ్గా ఉండాలని సూచించారు. ఇరవై ముప్పై ఏండ్ల నుంచి బీజేపీలో ఉన్న నాయకులు, కార్యకర్తలను కాదని మళ్లీ మేయర్ కావాలనో, ఎమ్మెల్యే కావాలనో చూడకుండా అంకిత భావంతో పనిచేయాలని హితవు పలికారు. ముందుగా కాంగ్రెస్‌లోకి వెళ్లాలని ప్రయత్నించాడని, మంత్రి పొన్నం ప్రభాకర్ రిజెక్ట్ చేయడంతో బండి సంజయ్‌ని ఆశ్రయించాడని, బీజేపీలో చేరి పోలీసు కేసులు మాఫీ చేయించుకోవాలని, అవినీతి ఆరోపణలు తుడిచి వేసుకోవాలనేది సునీల్‌రావు ఆలోచనని అన్నారు.
రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారుతున్నానని చెప్పిన ఆయన, తీరా బీజేపీ కండువా కప్పుకోగానే తనపై లేని పోని ఆరోపణలు చేస్తున్న తీరును గంగుల తప్పుబట్టారు. తాను ఏ తప్పు చేసినా, ఎలాంటి ఆరోపణలు వచ్చినా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేతిలోనే సీబీఐ, ఈడీలు ఉంటాయని, ఎవరితో విచారణ చేయించినా తనకు అభ్యంతరం లేదని, దమ్ముంటే చేయించాలని సవాల్ విసిరారు. తనలాగే సునీల్ రావు కూడా విచారణకు సిద్ధం కావాలని సూచించారు. ఎందరి రక్తంతో సునీల్‌రావు ఇల్లు కట్టారో తమకు తెలుసని, ఆయనపై వచ్చిన ఆరోపణలు కొన్ని మా పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లాయని, ఇప్పుడిప్పుడు ఇంకా ఆరోపణలు వస్తున్నాయని, ఇప్పటి నుంచి ఆయన వెనకే పడతామని స్పష్టం చేశారు. సునీల్‌రావు లాంటి స్వార్థపరులు పార్టీని వీడడం వల్ల తమకు పట్టిన దరిద్రం పోయిందని, శని విరగడయ్యిందని అన్నారు.
కేసీఆర్, తెలంగాణపై అభిమానం ఉన్నవాళ్లు ఎవరూ బీఆర్ఎస్ను వదిలి వెళ్లరు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వలాభం కోసం చేరిన సునీల్‌రావు లాంటి వాళ్లు మాత్రమే పార్టీని వీడిపోతున్నరు. రాబోయే కాలంలో కరుడుగట్టిన బీఆర్ఎస్ వాదులకే ప్రాధాన్యత ఇస్తం. బీఆర్ఎస్ అంటే తెలంగాణ సెంటిమెంట్‌లో పుట్టిన పార్టీ. రాష్ర్టాన్ని సాధించి, అభివృద్ధి చేసిన ఉద్యమ పార్టీగా చూడాలి. అభివృద్ధి చేయడంతోపాటు రాష్ట్ర ప్రజల మనోభావాలను కాపాడుతున్నం. రేపు ఈ బాధ్యత తీసుకుంటం. తమకు మార్గనిర్దేశనం చేసే కేసీఆర్‌తోపాటు సత్తా ఉన్న నాయకులు కేటీఆర్, హరీశ్‌రావు ఉన్నరు. ఇక ముందు పార్టీకి విధేయత ఉన్న నాయకులను తయారు చేస్తం. వాళ్లకే ప్రాధాన్యత ఇస్తం. రాబోయే కాలంలో బీఆర్ఎస్ను మంచి పార్టీగా తీర్చిదిద్దుతం. మరోసారి అధికారంలోకి వస్తం.
– గంగుల కమలాకర్