నిజానికి కాళేశ్వరం సిస్టమంతా బాగానే ఉన్నది. కానీ, ముఖ్యమంత్రి బుర్ర బాగాలేకనే ఈ ఇబ్బందులు వచ్చి పడుతున్నయి. నిజానికి మా అధినేత కేసీఆర్ చిన్న ఇషారా ఇస్తే చాలు.. పంపులు చాల్ చేయడానికి మేం సిద్ధంగా ఉన్నం. అయితే కేసీఆర్ మాత్రం సంయమనం పాటించాలని చెప్పిండు. ప్రభుత్వం ఏమిచేస్తుందో చూద్దాం అన్నడు. రేవంత్ ఇప్పటికైనా ఇగోను పక్కన పెట్టాలి. లక్షలాది రైతుల ప్రయోజనాలను, ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మోటర్లు ఆన్ చేయాలి
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కరీంనగర్, జూలై 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ రాజన్న సిరిసిల్ల (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డికి కావాల్సినంత రక్తం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని, రైతులను మాత్రం గోస పెట్టకుండా సాగునీర్వివాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఎల్‌నినో నేపథ్యంలో లక్షలాది మంది రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డ బరాజ్‌తో సంబంధం లేకుండా కన్నెపల్లి పంపులను ఆన్‌చేసి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల నుంచి తిరుగుబాటు తప్పదని, హిట్లర్‌కు పట్టిన గతే ఆయనకు పడుతుందని హెచ్చరించారు. సోమవారం ఆయన సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్లలో పర్యటించారు. స్థానిక నేతలు, రైతులతో ముచ్చటించారు. సాయంత్రం కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యాంను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయాచోట్ల కేటీఆర్ మాట్లాడారు. కన్నెపల్లి పంపుహౌస్‌ల నుంచి నీటిని ఎత్తిపోయకుండా సీఎం మాట్లాడుతున్న మాటలపై నిప్పులు చెరిగారు. పొలాలకు నీళ్లు ఇవ్వాలని అడిగితే రేవంత్‌రెడ్డి పైశాచికత్వం ప్రదర్శిస్తున్నాడని, బీఆర్ఎస్ నేతల రక్తం పారిస్తామంటూ చిల్లరమాటలు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. ఎల్‌నినో ద్వారా రాష్ట్రంలో కరువు వస్తుందని వాతావారణ నిపుణులు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయని, నీటి కోసం రైతులు అరిగోసపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్తాబాద్ మండలం నామాపూర్‌లో రైతులు తనతో గోడు వెల్లబోసుకున్నారని, వాళ్ల కష్టా లు అన్నీఇన్నీ కావని, పత్తి పంట మొలకలకు బిందెలతో నీళ్లు తెచ్చి దోసెడు దోసెడు పోసుకుంటూ కాపాడుకునే దుస్థి తి ఉందని వివరించారు.
ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సందర్శించి వృథాగా పోతున్న నీటిని కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్ల ద్వారా ఎత్తిపోసి రైతులకు అందించాలని డిమాండ్ చేశామని గుర్తుచేశారు. అయినప్పటికీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ‘రక్తం కావాలంటే మాది ఇస్తాం.. కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి.. రైతులకు నీళ్లు మాత్రం ఇవ్వాలి’ అని చెప్పారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌లోని మోటర్లను ఆన్ చేసి నీటిని ఎత్తిపోసి దిగువన ఎల్ఎండీ, మల్కపేట రిజర్వాయర్లు నింపితే ఈ మెట్ట ప్రాంతానికి సాగునీటి గోస తప్పుతుందని చెప్పారు.
ప్రభుత్వం ఆ దిశగా వెంటనే ఆలోచించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రికి మాపై కోపముంటే ఏమైనా చేసుకో కానీ, మాపై కోపాన్ని రైతుల మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద, రిటైర్డ్ ఇంజినీర్ల మీద చూపెడితే ఊరుకోబోమని హెచ్చరించారు. సీఎం ఇకనైనా బుద్ధి మాట మార్చుకోవాలని హితవు పలికారు. రాజకీయాలు చివరి ఆరు నెలలు చేద్దాం.. మిగిలిన సమయం ప్రజలకో సం పనిచేద్దామని రేవంత్‌రెడ్డే ఇటీవల చెప్పారని, అదే స్పిరిట్‌తో తాము పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశ పూర్వకంగా ఆనాడు బద్నాం చేశారని, ఇప్పుడు ఎల్‌నినో కరువు పరిస్థితులున్నా పట్టించుకోవడం లేదని, అందుకే తాము రైతుల పక్షాన పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఆయాచోట్ల కేటీఆర్ వెంట బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, మాజీ ఎమ్మెల్యేలు సుంకెరవిశంకర్, రసమయి బాలకిషన్, మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, కేటీఆర్ వెంట నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, తోట ఆగయ్య, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్, తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

పోలీస్ కిష్టయ్య కుటుంబానికి పరామర్శ
కార్పొరేషన్, జూలై 13 : తెలంగాణ ఉద్యమంలో అమరుడైన పోలీస్ కిష్టయ్య కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. సోమవారం కరీంనగర్‌లోని కిష్టయ్య ఇంటికి వెళ్లారు. కిష్టయ్య ఫొటోకు పూలమాల వేసి నివాళుర్పించారు. అనంతరం ఆయన సతీమణి పద్మావతి, కొడుకు రాహుల్, వర్ష దంపతులు, కుమార్తె డాక్టర్ ప్రియాంకతో ఆత్మీయంగా మాట్లాడారు. మనుమడు బేబీ వేదాంత్రాఘవ కిష్టయ్యను ఆశీర్వదించి, వస్ర్తాలు, కానుకలు అందించారు. కిష్టయ్య పేరులోని కే అక్షరంతో రూపొందించిన ప్రత్యేక లాకెట్‌ను బహూకరించారు. కేసీఆర్ కిట్‌ను కూడా అందించారు. అలాగే ప్రియాంక మెడికల్ పీజీ విద్యాభ్యాసం కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ప్రకటించిన ఆర్థిక సహాయంలో భాగంగా ఫీజుల చెక్కును అందించారు.
రక్తం ఇవ్వడానికి మేం సిద్ధం.. రైతులకు నీళ్లివ్వండి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేవలం బీఆర్ఎస్ వాళ్ల రక్తం కావాలని భావిస్తే.. అందుకు ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నం. ఇప్పటికే మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ముప్కల్లో రక్తదానం చేసిండు. ఆ రక్తాన్ని తీసుకొని తాగునీరు ఇవ్వాలని కోరిండు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో రక్తదానం చేసి, ఆ రక్తాన్ని రేవంత్‌రెడ్డికి ఇస్తామని బయలు దేరితే వాళ్లను అరెస్టు చేసిన్రు. ఇంకా ముఖ్యమంత్రికి రక్తం కావాలంటే.. కరీంనగర్లోనూ రక్తదాన శిబిరం నిర్వహించి అందరం ఇస్తం. అయితే మేం కోరేది ఒక్కటే. కన్నెపల్లి పంపులు ఆన్‌చేసి రైతులకు నీళ్లివ్వాలి.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాగు, తాగునీరు ఇవ్వాలి
ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆధారపడిన ప్రాంతాలు ఎడారిగా మారే ప్రమాదం కనిపిస్తున్నది. ఎల్ఎండీలో నీటిమట్టం 5.6 టీఎంసీలే ఉన్నది. నగరంలో నీటి సరఫరా బూస్టర్ పంపుల ద్వారా నీటిని తీసుకోవాల్సి వస్తున్నది. దీంతో నీటి సరఫరాకు ఇబ్బందులు వస్తున్నాయి. మరో 20 రోజుల తర్వాత తాగునీటికి కూడా అదే పరిస్థితి వస్తుంది. కనీసం తాగునీరైనా ఇబ్బంది లేకుండా ఇవ్వాలి. ఎల్ఎండీ పరిధిలో రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు ఇవ్వడంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మానకొండూర్, హుజూరాబాద్ నియోజకవర్గంలో తండ్లాట లేకుండా చూడాలి. నీటి కోసం బీఆర్ఎస్ రైతులు, ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది.
– కరీంనగర్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్
రిటైర్డ్ ఇంజినీర్‌పై ఆరోపణలు బాధాకరం
నీళ్లివ్వాలని సలహా ఇచ్చిన రిటైర్డ్ ఇంజినీర్లపై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సరికాదు. రాష్ట్రం ఆవిర్భవించకముందే రిటైర్డ్ అయిన తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు శ్యాంప్రసాద్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం బాధాకరం. ఆయన కంటతడి పెడుతూ మాట్లాడడం కొంత బాధగా అనిపించింది. రాష్ట్రం రాకముందే విరమణ పొందిన సదరు ఇంజినీర్‌ను జైలుకు పంపించకపోవడం తప్పయిందని రేవంత్‌రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఆయనపై అవినీతి ఆరోపణలు చేయడం ఏంటి? ముఖ్యమంత్రి స్థానంలో ఉండి బాధ్యతగా సమాధానం చెప్పాల్సింది పోయి నాయకుల రక్తం చల్లితే పంటలు పండుతాయని ఆటవిక భాష మాట్లాడడం ఏంటి? రైతుల పొలాలకు నీళ్లిచ్చేందుకు బీఆర్ఎస్ కార్యకర్తల, నాయకుల రక్తమే కావాలంటే మా కార్యకర్తలు రక్తం సైతం ఇచ్చేందుకు రెడీగా ఉన్నరు.
– హరిదాస్‌నగర్‌లో నాయకులు, కార్యకర్తలతో కేటీఆర్