పోరాటాల పురిటి గడ్డ, రైతు చైతన్య వేదిక అయిన జగిత్యాల జిల్లాలో రైతులు మరోసారి పోరుబాట పడుతున్నారు. రైతు భరోసా, రుణమాఫీ, వరికి బోనస్‌పై కాంగ్రెస్ సర్కారు చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించడం, కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను అటకెక్కించడాన్ని నిరసిస్తూ నేడు కోరుట్ల నుంచి జగిత్యాల వరకు లాంగ్‌మార్చ్ చేయడానికి సిద్ధమయ్యారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల నేతృత్వంలో చేపట్టే ఈ పాదయాత్రలో రైతులు, రైతు కూలీలు, రైతు నాయకులతోపాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.
జగిత్యాల, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ రైతులకు అనేక హామీలు ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం ఎకరాకు ఏటా 10 వేల పెట్టుబడి సాయం ఇస్తే, రైతు భరోసా పేరిట 15 వేలు చెల్లిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. రైతుకూలీలకు సైతం ఏడాదికి 12 వేల సాయం అందిస్తామన్నది. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అటకెక్కించింది. గత ప్రభుత్వంలో అమలైన పథకాలను కూడా అమలు చేయకపోగా, ఇస్తామన్న రైతు భరోసా సాయాన్ని వానకాలం పంటకు ఎగవేసింది. పంట సాగు చేసే భూమికే ఇస్తామంటూ.. పదెకరాలలోపు వారికే ఇస్తామంటూ కాలం గడిపి చివరకు చేతులు దులుపుకొన్నది. మరోవైపు రైతు కూలీలకు సాయం చేయకపోగా, కనీసం వారిని గుర్తించే కార్యక్రమం కూడా చేపట్ట లేదు. తాజాగా, యాసంగి సీజన్ మొదలైనా ఇంత వరకు రైతు భరోసా ఊసే లేదు. ఈ సీజన్‌కైనా ఇస్తుందా.. లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్వాకం వల్ల వానకాలం సీజన్లో ఒక్క జగిత్యాల జిల్లాకే 300 కోట్లు రాకుండా పోయాయి. అలాగే, ఈ యాసంగికి సంబంధించి 220 కోట్లు వచ్చే విషయంలో సందిగ్ధత ఏర్పడ్డ నేపథ్యంలో రైతాంగం తీవ్ర ఆవేదన, ఆగ్రహంతో ఉన్నది.
60 శాతం దాటని రుణమాఫీ
2 లక్షలలోపు రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రహసనంలా మారిపోయింది. జగిత్యాల జిల్లాలో దాదాపు 60 శాతానికి మించలేదు. ప్రభుత్వం పెట్టిన నిర్దేశిత సమయం వరకు జిల్లాలోని 1,38,142 మంది రైతులు పంట రుణం తీసుకున్నారు. జూలై నుంచి మూడు దఫాల్లో కేవలం 72,116 మంది రైతులకు 568.33 కోట్ల రుణాలను మాత్రమే మాఫీ చేసింది. ఇంకా 66,026 మందికి మాఫీ జరగాల్సి ఉన్నది. దీంతో రైతులు బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ, చివరకు ప్రజావాణిలో కలెక్టర్ వద్దకు పెద్ద సంఖ్యలో వచ్చి తమకు న్యాయం చేయాలని వేడుకొని విసిగిపోయారు. రాయికల్ మండలం మైతాపూర్, మల్లాపూర్ మండలం రాఘవపేట, గొర్రెపల్లి, మెట్పల్లి మండలం ఆత్మకూర్, వెల్లుల, కోరుట్ల మండలం జోగినిపెల్లి గ్రామాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. రుణమాఫీ కాని వారు రంది పడవద్దని, అందరికీ చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటనలు గుప్పించడంతోపాటు వ్యవసాయ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని, హెల్ప్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. రైతులను తిప్పితిప్పి చివరికి మొండిచేయి చూపడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యం కొనే దిక్కేది
ఎన్నికలకు ముందు వరికి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు 500 బోనస్ ఇస్తామంటూ రేవంత్‌రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించారు. రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే, యాసంగి పంట కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పట్టించుకోకపోగా, బోనస్ ఇవ్వలేదు. దీంతో అప్పుడే రైతులు నిరసన తెలిపారు. అయితే, వానకాలం వేసిన వరికి బోనస్ వస్తుందన్న ఉద్దేశంతో ఒక్క జగిత్యాల జిల్లాలోనే దాదాపు 3.31 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. అయితే, వానకాలం పంట ఆరంభమైన రెండు నెలల తర్వాత సన్నరకాలకు మాత్రమే మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు 500 బోనస్ ఇస్తామని సర్కారు ప్రకటించడంతో తీవ్ర నిరాశ చెందారు. ప్రభుత్వం తమను పూర్తిగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో కేవలం 85 వేల ఎకరాల్లో మాత్రమే సన్నరకాలు వేయగా, దాదాపు 2.40 లక్షల ఎకరాల్లో దొడ్డురకాలు సాగు చేశారు. దీంతో మెజార్టీ రైతులకు బోనస్ అందని పరిస్థితి ఏర్పడింది. సన్నాలకు మాత్రమే బోనస్ ఇవ్వడం ఏంటని, ఇప్పటికే సన్నాలకు బహిరంగ మార్కెట్లో 3 వేల నుంచి 3,100 వరకు పలుకుతున్నదని, ఈ ధరలతో చాలా మంది రైతులు నాలుగైదు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొనే సాగు చేస్తున్నారని, ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఎందుకూ పనికి రాదని వారు మండిపడుతున్నారు. దీనికి తోడు సన్నరకం బియ్యాన్ని గుర్తించేందుకు ప్రభుత్వం గింజల పరిమాణాన్ని లెక్కించే పద్ధతిని తీసుకురావడంపై ఆగ్రహిస్తున్నారు. వరికి బోనస్ సంగతి దేవుడెరుగు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనే పరిస్థితి లేదని మండిపడుతున్నారు. దాదాపు పదిహేను రోజుల క్రితమే కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పలు పోసినా కొనే వారు లేక దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేడు పాదయాత్ర
ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, విద్యుత్ కోతలు, ఎరువుల ధరల పెంపు, విత్తనాల కొరత, తదితర సమస్యలతో జగిత్యాల జిల్లా రైతులు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోరుబాటకు సమాయత్తమయ్యారు. జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టికి తీసుకువచ్చేందుకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సిద్ధమయ్యారు. రైతులతో కలిసి నేడు కోరుట్ల నుంచి ‘రైతు పోరాట పాదయాత్ర’ చేపడుతున్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే పాదయాత్ర వెంకటాపూర్, మేడిపల్లి, తాటిపెల్లి, చల్గల్ మీదుగా జగిత్యాలకు చేరుకోనున్నది. చల్గల్ సమీపంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశీరావు పాదయాత్రకు సంఘీభావం తెలియజేసి, అక్కడి నుంచి జగిత్యాల జిల్లా కేంద్రానికి వచ్చి సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం కలెక్టరేట్‌కు వెళ్లి వినతిపత్రం సమర్పించనున్నారు. పాదయాత్రలో రైతులతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతు సంఘాల నాయకులు పాల్గొననున్నారు. కరీంనగర్, హుజూరాబాద్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రమసమయి బాలకిషన్, దాసరి మనోహర్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పాల్గొననున్నారు.