మైనార్టీ గురుకుల విద్య మిథ్యగా తయారవుతున్నది. విద్యాలయాల నిర్వహణ గాడి తప్పి అందని ద్రాక్షగా మారుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆధునిక సౌకర్యాలు, వసతులతో పిల్లలు ఏ లోటూ లేకుండా అభ్యసించగా, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం.. అధికారుల పట్టింపులేమితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలైనా పూర్తిస్థాయిలో యూనిఫాంలు, షూలు, బుక్స్, నోట్స్ అందక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా బాల, బాలికలకు మూడు నెలలకోసారి అందించే కాస్మోటిక్ కిట్లు సైతం ఇవ్వకపోవడంతో బయట కొనుక్కునే పరిస్థితి వచ్చిందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు.
పెద్దపల్లి, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ)/పెద్దపల్లి కమాన్: మైనార్టీ పేద పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన మైనార్టీ గురుకులాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఎంతో సమర్థవంతంగా నడిచి ఖ్యాతి గడించిన ఈ స్కూళ్లు, ప్రస్తుతం అధ్వానంగా మారాయి. పెద్దపల్లి జిల్లాలో మూడు మైనార్టీ గురుకులాలు ఉండగా, ఇంటర్మీడియెట్ దాకా తరగతులు నిర్వహిస్తున్నారు.
పెద్దపల్లి మైనార్టీ బాలికల స్కూల్లో 5 నుంచి పదో తరగతి దాకా 285 మంది, ఇంటర్లో 90 మంది అభ్యసిస్తున్నారు. మంథని మైనార్టీ బాలికల స్కూల్లో 5 నుంచి పదో తరగతి దాకా 210 మంది, ఇంటర్లో 80 మంది, రామగుండం బాలుర స్కూల్లో 5 నుంచి పదో తరగతి దాకా 338 మంది, ఇంటర్లో 111 మంది అభ్యసిస్తున్నారు. యూనిఫాంలు, బుక్కులు రాక ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలోని మూడు మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం మొత్తం 1,114మంది అభ్యసిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫామ్స్, ఒక జత షూ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలవుతున్నా పంపిణీ చేయలేదు. ఒక జత స్పోర్ట్స్ డ్రెస్ ఇవ్వాల్సి ఉండగా, బాలురకు మాత్రమే పంపిణీ చేసి, బాలికలకు మొండిచేయి చూపారు. ఇక ఆయా సబ్జెక్టులకు సంబంధించిన టెక్స్, నోట్ బుక్స్ కూడా పంపిణీ చేయకపోవడంతో విద్యార్థులు చదువుకొనలేక పోతున్నారు.
గురుకుల విద్యార్థులకు మూడు నెలలకోసారి కాస్మోటిక్ కిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. బాలికలకు రిబ్బన్స్ (వైట్, బ్లాక్), పేల దువ్వెన, హెయిర్ బ్యాండ్స్, వాషింగ్-బాతింగ్ సబ్బులు, కోకోనట్ ఆయిల్, బ్రెష్, టూత్ పేస్ట్, టంగ్ క్లీనర్, షాంపు, పౌడర్, సానిటరీ న్యాప్ ప్యాడ్స్‌తో కూడిన కిట్స్ ఇస్తుంటారు. బాలురకు దువ్వెన, వాషింగ్-బాతింగ్ సబ్బులు, కోకోనట్ ఆయిల్, బ్రెష్, టూత్ పేస్ట్, టంగ్ క్లీనర్, షాంపు, పౌడర్ ఇస్తుంటారు. అయితే విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా కిట్స్ ఇవ్వకపోడంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. సొంత ఖర్చులతో కిట్స్‌ను కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.
మైనార్టీ గురుకులాల్లో గత విద్యాసంవత్సరంలో చివర మార్చి, ఏప్రిల్, మే నెలతోపాటు ప్రస్తుత విద్యా సంవత్సరం జూలై నెలకు సంబంధించి డైట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పెద్దపల్లి గురుకులానికి సంబంధించి 7 లక్షలు, రామగుండం స్కూల్‌కు సంబంధించి దాదాపు 12 లక్షలు, మంథని స్కూల్‌కు సంబంధించి దాదాపు 6.50 లక్షల బిల్లులు ఆగిపోయాయని, ప్రభుత్వం నుంచి ఎలాగైనా బకాయిలు ఇప్పించాలని ఆయా విద్యాలయాల ప్రిన్సిపాల్స్‌ను డైట్ కాంట్రాక్టర్లు కోరుతున్నారు. అలాగే మూడు గురుకులాలకు సంబంధించి అద్దె సైతం ఏడాదిగా బకాయి ఉన్నట్లు తెలిసింది.
మూడు గురుకులాలకు సంబంధించి నాలుగు నెలల డైట్ బిల్లులు, అద్దె, పెండింగ్‌లో ఉన్నాయి. యూనిఫాంలకు సంబంధించి కొలత తీసుకొని పంపించాం. స్పోర్ట్స్ దుస్తులు వచ్చాయి. ఇంకా కొన్ని పంపిణీ చేయాల్సి ఉంది. షూలకు సంబంధించిన సైజులు పంపించాం. ఆ ప్రకారం త్వరలోనే పంపిణీ జరుగుతుంది. కాస్మోటిక్ కిట్స్ పంపిణీ కూడా చేయాల్సి ఉంది. త్వరలోనే అందజేస్తాం.
-సురేశ్, మైనార్టీ గురుకులాల ఇన్చార్జి (కరీంనగర్)