Minister Sridhar Babu | రామగిరి, డిసెంబర్ 5 : బేగంపేట గ్రామంలో తాజాగా ప్రారంభించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మంత్రి శ్రీధర్ బాబు చిత్రాలు, ప్లెక్సీలు కొనసాగుతుండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న ఈ సమయంలో ఇలాంటి ప్రచారాత్మక ప్లెక్సీలు కొనసాగడం పట్ల స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వ్యవస్థాపకులు, అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుండి ప్రజాప్రతినిధుల ప్రచార సామగ్రి తొలగించాల్సిన బాధ్యత ఎన్నికల శాఖ, సంబంధిత అధికారులదే కాగా బేగంపేట కొనుగోలు కేంద్రంలో మాత్రం చర్యలు చేపట్టకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్లెక్సీలు అధికార పార్టీకి అనుకూలంగా వాతావరణం సృష్టించే ప్రయత్నంగా కనిపిస్తోందని గ్రామస్థులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ విషయంపై వెంటనే అధికారులూ స్పందించి పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల కోడ్ అమలులో ఎటువంటి రాజీపడకూడదని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.