Vodithela Satishkumar | చిగురుమామిడి, మార్చి 7 : మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీలకతీతంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయాలని, పక్షపాత వైఖరి మానుకొని చిత్తశుద్ధితో గౌరవెల్లి ప్రాజెక్టు నుండి రైతులకు సాగు నీరు అందించాలని, అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో సహకరిస్తామని హుస్నాబాద్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్నికల్లో ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ అరకొర పనులు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో పార్టీలకతీతంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు తోటపల్లి రిజర్వాయర్ ద్వారా 23 వేల ఎకరాల కు సాగునీరు అందించామని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి సైతం గోదావరి జలాలను చూసి సొంత గ్రామం రేకొండలో సంతోషం వ్యక్తం చేశారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాటల్లో తప్ప చేతుల్లో పనులు లేవని ఎద్దేవా చేశారు. పార్టీ గుర్తులకు అతీతంగా ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచ్లకు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందని, కేవలం కాంగ్రెస్ కండువా కప్పుకున్న వారికి మాత్రమే గ్రామాల్లో నిధులు మంజూరు చేయడం ఏంటని మంత్రిని ప్రశ్నించారు. నిధులు మంజూరు చేయని సర్పంచులు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడలేదా..? అని ప్రశ్నించారు. ఆ గ్రామాలు నియోజకవర్గంలో లేవా అని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు ఎక్కువ గెలిచారని అన్నారు.
పాత బిల్లులు ఇవ్వకుండా పనులు ఎట్లా చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ వారికి తప్ప మిగతా వారికి పనులు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో గత ఎమ్మెల్యేలు ఇలాంటి విధంగా వ్యవహరించ లేదని అన్నారు. బాధ్యతను విస్మరిస్తే ధర్నాలు, ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు సాగునీరు అందించామని చెరువులు, కుంటలు నింపి రైతుల పంటలు దిగుబడి అధికంగా వచ్చేలా కృషి చేశామన్నారు. మిషన్ భగీరథ ద్వారా త్రాగు నీరు అందించామన్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా కెనాల్ ద్వారా పంటలకు సాగునీరు అందించామన్నారు.
మెంతా తుఫాన్ తో నష్టపోయిన రైతుల సమస్యలు పరిష్కరిస్తామని నియోజకవర్గంలో సీఎంను తీసుకువచ్చి నష్టపరిహారం అందిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతుల సమస్యలను మంత్రి మరిచిపోయారని ఎద్దేవా చేశారు. రైతులను ఆదుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉందన్నారు. 24 గంటల కరెంట్ సరఫరా గత ప్రభుత్వంలో ఉండేదని, దాంతో పంటల సాగు దిగుబడి పెరిగింద న్నారు. ప్రస్తుతం కరెంటు ఇబ్బందులు ఎదుర్కొని రైతులు గందరగోల పరిస్థితిలో ఉన్నారన్నారు. రైతులకు సరిపడా విద్యుత్ అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గంలో రైతులకు సరిపడా యూరియాను అందించడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని, రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారన్నారు. చెప్పులు లైన్లో పెట్టాల్సిన పరిస్థితి దాపురించిందని అన్నారు. మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కు ఎమ్మెల్యేగా పనిచేసిన నేను సమస్యలపై ప్రశ్నించడం అతని పనితీరుకు నిదర్శనం అన్నారు. బిఆర్ఎస్ పాలనలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసినప్పటికీ కాంగ్రెస్ నాయకులు కేసులు వేసి పనులను అడ్డుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. మంత్రిగా ఉండి గౌరవెల్లి ప్రాజెక్టు నీరు ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు.
ఎంపీగా ఉండి ఏమి చేయలేదని, మాటలకే పరిమితం అవుతూ మోటార్ సైకిల్ పై గట్టుపై తిరగడమేనా అని ప్రశ్నించారు. నీటి ఇబ్బందిని పరిష్కరించలేని ఎడల మంత్రి చేతగానితనమే అని ప్రజలు భావిస్తారని అన్నారు. హైదరాబాద్ కు ఇన్చార్జి మంత్రిగా పరిమితమేనా లేక నియోజకవర్గం అభివృద్ధి ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. పెండింగ్లో ఉన్న కుల సంఘాల భవన నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని, ప్రజా పాలన పేరుతో 99 రోజుల కార్యక్రమాన్ని వివక్ష లేకుండా ముందుకు తీసుకువెళ్లాలని కోరారు.
పబ్లిక్ రిలేషన్ స్టంట్ ను వదిలేసి ప్రజలకు సేవ చేయాలని సతీష్ కుమార్ హితువు పలికారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రధాని కావాలని కోరుకుంటున్నానని, మైదానం విడిచిపెట్టి సాము చేయకండని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సాంబారి కొమురయ్య, మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, మాజీ అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, సింగిల్ విండో మాజీ చైర్మన్ జంగా రమణారెడ్డి, ఆర్బీఎస్ మండల మాజీ అధ్యక్షుడు పెనుకుల తిరుపతి, సర్పంచ్లు ఆకవరం భవాని, సన్నీల కవిత, సాంబారి భారతమ్మ, ఒంటెల కిషన్ రెడ్డి, బోయిని రమేష్, నాయకులు కత్తుల రమేష్, జక్కుల రవి, కానుగంటి భూమిరెడ్డి, పెసరి రాజేశం, సన్నిల వెంకటేశం, ఆకవరం శివప్రసాద్, యళ్ళ జనార్దన్ రెడ్డి, బుర్ర తిరుపతి, కరివేద మహేందర్ రెడ్డి, బెజ్జంకి రాంబాబు, ఎండి సర్వర్ పాషా, బెజ్జకి లక్ష్మణ్, విజయలక్ష్మి, మహంకాళి కొమురయ్య, చామకూర సంపత్ రెడ్డి, నాగేల్లి రాజిరెడ్డి, అనుమాండ్ల సత్యనారాయణ, వివిధ గ్రామాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.