సైదాపూర్, జనవరి 29 : ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలని, ఎన్నికల తర్వాత అందరూ అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సోమవారం సైదాపూర్ మండలంలోని ఆరెపల్లిలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడంతో పాటు గుజ్జులపల్లిలో రహదారి నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను హైదరాబాద్‌కు ఇన్చార్జి మంత్రినే అయినా, హుస్నాబాద్‌కు ఎమ్మెల్యేనని చెప్పారు. తనను గెలిపించిన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌కు ఫోన్‌చేసి అభివృద్ధికి సహకరించాలని కోరానన్నారు.
తనది తెలంగాణ కోసం పోరాడిన చరిత్ర అని, రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగానని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మండ ల సర్పంచులు తమ బిల్లుల విషయమై వినతిపత్రం ఇవ్వగా, బిల్లులు న్యాయపరంగా ఉంటే ప్రభుత్వం సానుకూలంగా స్పందింస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్ పేరాల గోపాలరావు, ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, వెన్నంపల్లి సింగిల్‌విండో చైర్మన్ బిల్ల వెంకటరెడ్డి, సర్పంచ్ ఆవునూరి పాపయ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దొంత సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.