విద్యానగర్, నవంబర్ 6 : వైద్య వృత్తి పవిత్రమైనదని, దేవుడితో సమానంగా చూస్తారని, ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కరీంనగర్‌లోని ఐఎంఏ హాల్లో బుధవారం రాత్రి నిర్వహించిన నూతన ఐఎంఏ జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. వైద్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
సామాజిక బాధ్యతగా వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు సేవలందించాలన్నారు. కరీంనగర్‌ను మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దాలని సూచించారు. జిమ్‌కు 10 లక్షలు కేటాయిస్తానని, అలాగే ఐఎంఏ హాల్ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తానన్నారు. అంతకుముందు నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు ఎనమల్ల నరేశ్, శ్రీపురం నవీన్‌కుమార్, కోశాధికారి చల్లూరి విజయ్‌కుమార్‌తో కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు గాలి ప్రసాద్, శ్యాంసుందర్, బీఎన్‌రావు, నూతన ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు (ఎలెక్ట్డ్) కిషన్, వైద్యులు ఎడవెల్లి విజయేందర్‌రావు, వసంతరావు, విజయమోహన్‌రెడ్డి, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ గుండా వీరారెడ్డి, వాసుదేవ శ్రీనివాస్, రాంకిరణ్, అలీం, రమణచారి, వెంకట్‌రెడ్డి, బంగారి రజనిప్రియదర్శిని, ఆది శ్రీదేవి పాల్గొన్నారు.