కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధి మరింత విస్తరించనుందా..? కొత్తపల్లి మున్సిపాలిటీ నగరంలో కలువనున్నదా..? దీంతో పాటు మరిన్ని గ్రామాలు విలీనం కానున్నాయా..? అంటే.. రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపాదనలు పంపించాలని తాజాగా, కలెక్టర్‌కు లేఖ రాయడం అందుకు బలాన్ని చేకూరుస్తున్నది. దీంతో గ్రామాల విలీనం ఖరారయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఈ క్రమంలో నగరపాలక సంస్థలో గ్రామాల విలీనం మరోసారి తెరపైకి వచ్చింది.
కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 21 : ఐదేళ్ల కిత్రం కరీంనగర్ నగరపాలక సంస్థలో చుట్టూ ఉన్న తొమ్మిది గ్రామాలను విలీనం చేశారు. కాగా, ప్రస్తుతం మరో ఆరు గ్రామాలతోపాటు, కొత్తపల్లి మున్సిపాలిటీని విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పెరుగుతున్న నగర జనాభాతో చుట్టూ ఉన్న గ్రామాల్లోనూ నివాసాలు పెరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర సౌకర్యాలను పెంచేందుకు ఆయా గ్రామాలను నగరపాలక సంస్థలో విలీనం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో శివారు గ్రామాలను విలీనం చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ నెల 9న జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. శివారు గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సదుపాయాలను మెరుగుపర్చడంతోపాటు, పట్టణీకరణను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
విలీనం కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాయడం కరీంనగర్ చుట్టూ ఉన్న గ్రామాల్లో చర్చంశనీయంగా మారింది. గతంలో నగరపాలక సంస్థలో తొమ్మిది గ్రామాలను విలీనం చేసిన సమయంలోనే బొమ్మకల్ గ్రామ పంచాయతీని విలీనం చేయకపోవడంపై విమర్శలు వచ్చాయి. అలాగే, కొత్తపల్లి మున్సిపాలిటీని ఏర్పాటు చేయగా, ఇప్పుడు దానిని కూడా కరీంనగర్లో విలీనం చేసేందుకు ప్రతిపాదనలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ప్రజల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే విలీనం చేసిన గ్రామాల్లో పరిస్థితులను బేరీజు వేసుకుంటున్న ఆయా గ్రామాల ప్రజలు ఈ విలీనానికి ఏ మేరకు స్పందిస్తారన్న విషయంలో ఆసక్తి నెలకొంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలను విలీనం చేసిన సమయంలో మూడేళ్లపాటు ఆయా గ్రామాల్లో ఆస్తి పన్నులను పెంచకుండా చర్యలు తీసుకున్నది. ఆ మేరకు ఆయా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కూడా కేటాయించింది. కాగా, ప్రస్తుత ప్రభుత్వం ఈసారి విలీనం చేసే ఆయా గ్రామాల ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తుందన్న చర్చ జరుగుతున్నది. మొత్తానికి మరోసారి నగరపాలక సంస్థలో గ్రామాల విలీనం ఇప్పుడు హాట్‌టాఫిక్‌గా మారింది.