కరీంనగర్‌కు మరోసారి కాబోయే ఎమ్మెల్యే గంగుల కమలాకరేనని, ఆయనపై పోటీ చేసేందుకు ఇతర పార్టీల నాయకులు భయపడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ విమర్శించారు. గంగులపై పోటీ చేయాలంటే పోచమ్మ గుడి ముందు కట్టేసిన పొట్టేలులాగే ఉంటుందని, అందుకే కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఫాంలు తమకు వద్దంటే తమకు వద్దని తలో దిక్కు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం కరీంనగర్‌లోని ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్‌కో.. బీజేపీకో ఓటేసి రాష్ర్టాన్ని ఢిల్లీ చేతిలో పెడదామా..? మన బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేసి తండ్రి లాంటి కేసీఆర్ చేతిలో పెడదామా..? అని ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో తప్పు చేసి 58 ఏండ్లు గోసపడ్డామని, ఇప్పుడు మరో తప్పు చేసి ఆ పరిస్థితులను పునరావృతం చేసుకోవద్దని అమాత్యుడు సూచించారు.
కరీంనగర్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : ‘కరీంనగర్‌కు మరోసారి కాబోయే ఎమ్మెల్యే గం గుల కమలాకరే.. ఆయనపై పోటీ చేసేందుకు ఇతర పార్టీల నాయకులు భయపడుతున్నరు. అటొకలు.. ఇటొకలు పారిపోతున్నరు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. బుధవారం కరీంనగర్ జి ల్లా కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వా ద సభలో ఆయన మాట్లాడారు. 2009 నవంబర్ 29న అల్గునూర్ చౌరస్తాలో కేసీఆర్ అరెస్ట్ అయినపుడు అంటుకున్న అగ్గి తెలంగాణ వచ్చే వరకు ఆరలేదని, ఇప్పుడు నవంబర్ 30న మళ్లీ కరీంనగర్లో అగ్గి పుట్టాలని, ఆ అగ్నికీలల్లో కాంగ్రె స్, బీజేపీ దహించుకపోవాలని, కొట్టుకుపోవాలని పిలుపునిచ్చారు. ఆయన మాటల్లోనే..
నీళ్ల కోసం గంగుల పోరాడిండు
తెలంగాణ ఏర్పడిన తొమ్మిదిన్నరేళ్ల కింద నాతోపాటు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్‌ను ఆశీర్వదించారు. కేసీఆర్ సీఎం అయ్యారు. ఈ తొమ్మినరేండ్లలో తెలంగాణలో ఎన్ని మార్పులు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే మరిన్ని మార్పులు తెస్తాం. కరీంనగర్లో వచ్చిన మార్పు మీ కండ్ల ముందటనే ఉన్నది. కావాల్సినంత కరెంట్, కడుపునిండా తాగు నీరు, విద్య, వైద్యం అన్ని రంగాల్లో బాగైంది. కరీంనగర్లో ఏ ఒక్క లోటు లేదు. ఒకప్పుడు ఎల్ఎండీ నీళ్ల కోసం కమలాకర్ ఎన్నోసార్లు యుద్ధం చేసిండు. మా నీళ్లు మాకే ఉండాలని, గేట్లు బంజేయాలని ఎన్నోసార్లు నీళ్ల కోసం పంచాయితీ పెట్టుకున్న డు. ఇప్పుడు ఆ గోస ఉన్నదా..? ఎక్కడో ఉన్న కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోసి, 618 మీటర్లకు దివి నుంచి భువికి నీళ్లు తీసుకొచ్చిన అపర భగీరథుడు మన కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మిడ్‌మానేరు, అప్పర్ మానేరు, లోయర్ మానేరు నిండుగా మారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక సజీవ జలధారగా మారిపోయింది. ఎస్సారెస్పీ, వరద కాలువలో 365 రోజులు నీళ్లు ఉంటున్నయి. అప్పర్ మానేరు నుంచి గోదావరి వరకు, ఎక్కడ చూసినా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జలాలతో కళకళలాడుతున్నది.
నాలుగు మెడికల్ కాలేజీలు తెచ్చాం
ఒక్క మెడికల్ కళాశాల లేని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇప్పుడు నాలుగు మెడికల్ కళాశాలలు వచ్చినయి. మంత్రి గంగుల కమలాకర్ నాయకత్వంలో బలహీన వర్గాల బిడ్డలకు గానీ, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల పిల్లలకు 1,001 గురుకుల పాఠశాలలు ఉన్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ఈ ఘ నత గంగుల కమలాకర్‌కు కూడా దక్కుతది. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో బలహీన వర్గాల సంక్షేమ శాఖను ఆయన అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు.
ఎంపీగా గెలిచి బండి ఏం చేసిండు?
కరీంనగర్లో హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా కలిసి కట్టుగా ఉంటున్నరు. మతం పేరిట చిచ్చు పెట్టే సన్నాసులు ఇదే కరీంనగర్ నుంచి కొంత మంది వచ్చిన్రు. ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమలాకర్ చేతిలో ఓడిపోయి చావుదెబ్బ తిని, ఆ ఏడుపు, ఆ నటనతో ఏడ్చీ, ఏడ్చీ అమ్మా.. అయ్యా.. అని వినోద్‌కుమార్ మీద ఎంపీగా పోటీ చేసి, హిందూ అని, ముస్లిం అని మనందరినీ మోసం చేసి, లేని పంచాయితీ పెట్టి ఆనాడు ఒకాయన ఇక్కడి నుంచి ఎంపీ అయ్యిండు. ఆయన ఎంపీ అయినప్పటి నుంచి నేటి వరకు ఏం పని చేసింపడ. కరీంనగర్ పట్టణానికి గాని, పార్లమెంట్‌కు గాని ఒక్క పైసా కూడా తేలేదు. ఒక్క కొత్త స్కూల్ తెచ్చిండా..? ఒక్క నవోదయ, ఒక్క కేజీబీవీ పాఠశాల, ఒక ట్రిపుల్ ఐటీ, ఒక మెడికల్ కళాశాలన్నా తెచ్చిండా..? ఒక ఇంజినీరింగ్ కళాశాలన్నా తెచ్చిండా..? బడి తేలేదు. కనీసం గుడి అయినా తెచ్చిండా..? కమలాకరే తిరుమల తిరుపతి దేవస్థానంలో మాట్లాడి వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని తెచ్చిండు.
వాళ్లకు అధికారం ఇస్తే యాభై ఏండ్లు వెనకకుపోతం
కమలాకర్ అన్న ఒక గొప్ప మాట చెప్పిండు. 1956లో మన తాతలు ముత్తాతలు తప్పు చేశారు. ఆనాడు తెలంగాణ, ఆంధ్రా కలిసేందుకు ఒప్పుకుని తప్పు చేశారు. ఆ తప్పు నుంచి బయట పడేందుకు 58 ఏండ్లు పట్టింది. ఎన్నో రకాలుగా తండ్లాడితే ఆ తప్పుల నుంచి మొన్న మొన్ననే బయటపడ్డం. ఇప్పుడు మరోసారి తప్పు చేసి కాంగ్రెస్‌కో, బీజేపీకో ఓటు వేస్తే మరోసారి యాభై ఏండ్లు వెనుకకు పోతాం. కష్టపడి సాధించుకున్న తెలంగాణ ఆగమైతది. ఖరాబైతది. ఇదే కరీంనగర్లో నిరాహారదీక్ష ప్రారంభించి చావు నోట్లో తలపెట్టిన మీ ఆశీర్వాదంతో తెచ్చిన తెలంగాణను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపిన కేసీఆర్ ఒకపక్క..
తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయమంటే ఆనాడు అమెరికా వెళ్లి దాక్కున్న ఇప్పటి బీజేపీ అధ్యక్షు డు కిషన్‌రెడ్డి ఇంకో పక్క, ఇంకొకరు ఓటుకు నోటు దొంగ, 50 లక్షలు పట్టుకొని కెమెరాల ముందు దొరికి పోయిన థర్డ్ క్లాస్ క్రిమినల్ రేవంత్‌రెడ్డి. వీళ్లతో మనం పోటీ పడాలా..? వా ళ్లకు ఓటేసి రాష్ర్టాన్ని వాళ్ల చేతిలో పెడదామా..? తండ్రి లాంటి కేసీఆర్ చేతిలో పెడదామా..? ఒక తప్పు చేసి 58 ఏండ్లు తండ్లాడినం. ఇప్పుడు మరో తప్పు చేసి ఆ పరిస్థితులను పునరావృతం చేసుకోవద్దు. మన అభ్యర్థులు గంగుల కమలాకర్ అయినా, రసమయి బాలకిషన్ అయినా, సుంకె రవిశంకర్ అయినా.. చివరికి నేనైనా.. మీరు వేసే ఓటు మాకే కాదు, కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి దోహదపడుతుంది. అదే కాంగ్రెస్‌కో, బీజేపీకో వేస్తే ఢిల్లీకి, గుజరాత్‌కు పోతుంది. వాళ్లకు గులాంగిరి చేసెతానికి మళ్లా తెలంగాణ యాభై ఏండ్లు వెనకకు పోవడానికి కారణం అవుతుంది.
రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం
గంగుల కమలాకర్ స్వయంగా ఒక ఆలోచన చేసి సీఎం కేసీఆర్‌కు చెప్పిండు. తెలంగాణ అన్నపూర్ణగా మారింది. దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది. కానీ, ఇక్కడ ఉండే మన బిడ్డలకు కడుపు నిండా సన్నబియ్యంతో బువ్వ పెడదామని చెప్పగానే అన్నపూర్ణ అనే కొత్త పథకం తీసుకురావాలకున్నం. అన్ని రేషన్ కార్డుల మీద దొడ్డు బియ్యం బదులు నాణ్యమైన సన్న బియ్యం అందిస్తం. కొత్తగా సౌభాగ్యలక్ష్మి అనే పథకం తెస్తున్నం. అర్హులైన ప్రతి మహిళకు నెలకు 3 వేలు అందించబోతున్నం. ఆసరా పెన్షన్లు పెరుగుతాయి. రైతు బంధు పెరుగుతది. కేసీఆర్ ఆరోగ్య రక్ష అనే కొత్త కార్యక్రమం కింద ఎవరికి ఏ అవసరమైనా 15 లక్షల విలువైన వైద్య సేవలు కుటుంబం మొత్తానికి ఉచితంగా అందించబోతున్నం. ఇన్ని పథకాలు అమలు కావాలంటే కమలాకర్, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్‌ను గెలిపించి శాసన సభకు పంపించి కేసీఆర్‌ను ఆశీర్వదించాలి.
వాళ్ల వీళ్ల మాటలు విని మోసపోవద్దు
రేపు కరీంనగర్‌కు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ వస్తున్నారు. ఇంకా ఎవరెవరో వస్తుంటారు.. పోతుంటారు. ఏవేవో మాటలు చెప్తుంటారు. వాళ్ల మాటలు విని యువకులు మోసపోవద్దు. ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి తొమ్మిదేండ్లలో 2.20 లక్షల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టి 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. మిగతావి కూడా భర్తీ చేస్తాం. జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తాం. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పూర్తి స్థాయిలో పటిష్టంగా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తాం. తిరిగి మరోసారి అవకాశం కల్పించాలని పేరు పేరునా విజ్ఞప్తి చేస్తున్నా.
పాల్గొన్నది వీరే..
ప్రజా ఆశీర్వాద సభలో మండలి చీఫ్ విప్ భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థులు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, నగర మేయర్ వై సునీల్ రావు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్కుర్మాచలం, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపా రాణి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్, మాజీ ఎమ్మెల్యే కొడూరి సత్యనారాయణ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్ రావు, పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, ఎంపీపీలు పిల్లి శ్రీలత, లక్ష్మయ్య, జడ్పీటీసీ పిట్టల కరుణ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
మీలో ఒకడిగా ఉన్నా.. ఆశీర్వదించండి
నేను కౌన్సిలర్‌గా, కార్పొరేటర్‌గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా రాజకీయాల్లో ఉన్న. ఎలా ఉన్నా నేను మారలేదు. నా మనసూ మార లేదు. మీ అన్నగా, తమ్ముడిగా, బిడ్డగా మీలో ఒకడిగా.. మీతోనే ఉన్న. ఎవరికి ఏ ఆపద వచ్చినా మీ ముందున్న. ఇకపై కూడా మీతోనే ఉంట. మీకు సేవ చేసే భాగ్యం నాకు కల్పించండి. భారీ మెజార్టీతో మరోసారి ఆశీర్వదించండి. మీ దీవెనలతో మరింత ఉత్సాహంగా పనిచేస్త. కేసీఆర్, కేటీఆర్ మన వెంట ఉన్నరు. నిధులకు ఎలాంటి కొరత లేదు. ఇప్పటికే కరీంనగర్‌ను గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసిన. నేను గెలిస్తే కరీంనగర్‌ను గొప్ప నగరంగా తీర్చిదిద్దుత. మన కోసం, మన పిల్లల కోసం, మన రాష్ట్ర బంగారు భవిష్యత్ కోసం మూడోసారి కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి.
కరీంనగర్ నుంచే అగ్గి పుట్టాలి
తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ నిరాహార దీక్ష ఈ గడ్డ మీదనే ప్రారంభమైంది. 2009 నవంబర్ 29న అల్గునూర్ చౌరస్తాలో కేసీఆర్ అరెస్ట్ అయినప్పుడు అంటుకున్న అగ్గి, రాష్ట్రం వచ్చే దాకా ఆరలేదు. ఇప్పుడు నవంబర్ 30న మళ్లీ కరీంనగర్లో
అగ్గి రగలాలి. ఆ అగ్ని కీలల్లో కాంగ్రెస్, బీజేపీ దహించుకుపోవాలి.
అందరినీ గెలిపించుకోవాలి
గంగులకు ఓటేస్తే సరిపోదు. వినోదన్నకు కూడా ఓటెయ్యాలె. చివరిసారి మోసం జరిగింది. ఈసారి అట్ల జరగొద్దు. మానకొండూర్, చొప్పదండి, ఎమ్మెల్యేలుగా రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్‌ను కూడా గెలిపించుకోవాలి. చుట్టాలు, దోస్తులకు అందరికీ ఫోన్లు చేసి దండం పెట్టి మరీ ఓట్లు అడగాలి.
గంగుల గెలుపు ఖాయం
కరీంనగర్ అభివృద్ధే గంగుల కమలాకర్‌ను గెలిపిస్తుంది. గంగులతో పోటీ పడేవారు ఎవరూ లేరు. ఆయన గెలుపు ఖాయం. ఈ సభకు వచ్చిన జనాన్ని చూస్తే ఆ విషయం స్పష్టమవుతున్నది. నేను ఇది గర్వంతో చెప్పడం లేదు. పచ్చి నిజాన్నే చెబుతున్న. ఈ రోజు వరకు కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారో ఎవరికి తెలువదు. బీజేపీ నుంచి పోటీ చేస్తమని చెప్పేవాళ్లు చేస్తామో లేదో అనే డైలామాలో ఉన్నరు. కాంగ్రెస్, బీజేపీ నాయకులను దరిదాపుల్లోకి రానియద్దు. ప్రజల కోసం పనిచేసే పార్టీ, ప్రజల కోసం పాటు పడే నాయకుడు ఎవరో గుర్తించాలి. మంచి నిర్ణయం తీసుకుని కేసీఆర్‌కు మరోసారి ఘన విజయాన్ని అందించాలి.
– రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్