దక్షిణ కాశీగా భాసిల్లుతున్న వేములవాడ.. స్వరాష్ట్రంలో దివ్యక్షేత్రంగా మారబోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో అద్భుత క్షేత్రనగరిగా రూపుదిద్దుకుంటున్నది. రాజన్న ఆలయంతోపాటు పట్టణాన్ని సమగ్రాభివృద్ధి చేసేవిధంగా వేములవాడ ఆలయ ఏరియా అభివృద్ధి ప్రాధికార సంస్థ (వీటీడీఏ)ను సీఎం ఇప్పటికే ఏర్పాటు చేయగా, ప్రగతికి అడుగు పడింది.
మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేశ్‌బాబు చొరవతో కోట్లాది రూపాయల పనులు పరుగులు తీస్తున్నాయి. ఆలయ విస్తరణకు 34ఎకరాలు, బద్ది పోచమ్మ గుడికి ఎకరం స్థలం సేకరించగా, రహదారులు, వంతెనలు పూర్తయ్యాయి. ఇంటింటికీ భగీరథ నీళ్లు అందుతుండగా, ఎత్తిపోతలతో ఎస్సారార్ జలాశయం నుంచి రాజన్న గుడిచెరువుకు గోదావరి జలాలు తరలివచ్చాయి. మరోవైపు పట్టణంలో అభివృద్ధి జోరందుకోగా, తాజాగా మరో 72కోట్ల పనులు ప్రారంభం కానున్నాయి.
– వేములవాడ, డిసెంబర్ 19
నేడు వేములవాడకు కేటీఆర్
మంత్రి కేటీఆర్ మంగళవారం వేములవాడలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతో కలిసి 72కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్నారు. 20కోట్లతో చేపట్టనున్న పట్టణ రహదారులు, స్టేడియం, సినారె కళామందిరం పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేయనున్నారు. అలాగే 52కోట్లతో రహదారుల పునరుద్ధరణ పనుల శిలాఫలాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత రుద్రంగిలో 3.50 కోట్లతో నిర్మించిన కస్తూర్బా స్కూల్ భవనాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1.30గంటలకు వేములవాడలోని మహాలింగేశ్వరగార్డెన్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు.
వేములవాడ, డిసెంబర్ 19 : స్వరాష్ట్రంలో వేములవాడ ప్రగతి బాట పట్టింది. మంత్రి కేటీఆర్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు సహకారంతో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. వీటీడీఏ, ప్రభుత్వ నిధులతో ఇప్పటికే పనులు వేగంగా సాగుతున్నాయి. 135కోట్లతో పట్టణంలోని రహదారులు, వంతెన నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి.
42కోట్లతో ఇంటింటికీ మిషన్ భగీరథ జలాలను సరఫరా చేస్తున్నారు. అలాగే రాజన్న గుడిచెరువులో 365 రోజులు గోదావరి జలాలను నింపేందుకు 20కోట్లతో ఎత్తిపోతల పథకం కూడా పూర్తి చేసి, ఇప్పటికే రెండు దఫాలుగా రాజరాజేశ్వరజలాశయం నుంచి జలాలను ఎత్తిపోశారు. వేములవాడ మూలవాగుకు జీవకళను తీసుకువచ్చే విధంగా 20కోట్లతో నాలుగుచెక్డ్యామ్లు నిర్మించారు.
25కోట్లతో వంద పడకల దవాఖానను నిర్మించడమే కాకుండా అత్యాధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. అలాగే 7కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణం కూడా వేగవంతంగా సాగుతున్నది. మూలవాగు ఒడ్డున 2కోట్లతో వైకుంఠ ధామాన్ని కూడా నిర్మించారు. నిర్మాణంలో ఉన్న స్టేడియం పనులకు 5కోట్ల కూడా ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. 5కోట్ల నిధులతో శిథిలావస్థకు చేరిన సినారె కళామందిరాన్ని పునరుద్ధరిస్తున్నది.
రాజన్న ఆలయ విస్తరణ కోసం 30కోట్లతో సేకరించిన 34 ఎకరాల స్థలం
30కోట్లతో 34ఎకరాల స్థలం సేకరణ
రాజన్న ప్రధానాలయం 25 గుంటల్లోపే ఉన్నది. ఆలయ ప్రాకారం, రాజగోపురాలు మాత్రం 65 ఏళ్ల కింద నిర్మించినట్లుగా తెలుస్తున్నది. స్వామి వారి దర్శనం కోసం మన రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. ఏటా కోటికి మందికిపైగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే ఆలయం చిన్నదిగా ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆలయాన్ని పరిశీలించి విస్తరణకు శ్రీకారం చుట్టారు. ఆలయాన్ని ఆనుకొని 169ఎకరాల విస్తీర్ణంలో గుడిచెరువు ఉండగా, ఆ చెరువును ఆనుకొని ఉన్న భూములను కొంత వరకు సేకరించారు. 30కోట్లు వెచ్చించి 34ఎకరాలు సేకరించి, ఐదు ఎకరాల్లో విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వచ్చే వందేళ్ల వరకు స్వామివారి సన్నిధికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్న ఉద్దేశంతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. రెండున్నర గుంటల్లో ఉన్న బద్దిపోచమ్మ ఆలయాన్ని కూడా విస్తరించేందుకు ఇటీవలే 18కోట్లు వెచ్చించి ఎకరం స్థలాన్ని కూడా సేకరించారు. ప్రణాళికాబద్ధంగా ఆలయాన్ని కూడా ఆధునీకరించేందుకు వీటీడీఏ సిద్ధమవుతున్నది.
రాజన్న క్షేత్రం ప్రగతిబాట
నాటి ఉమ్మడి పాలనలో మన ఆలయాలపై చిన్నచూపు ఉండేది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన చారిత్రాత్మక విశిష్టత కల్గిన క్షేత్రాలపైనా వివక్ష కొనసాగేది. అభివృద్ధి జాడ కనిపించకపోయేది. కానీ, స్వరాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ పడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్వ వైభవం తెస్తున్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అత్యంత అద్భుతంగా పునర్నిర్మించిన అనంతరం ఆయన దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు నడుంబిగించారు. ఇప్పటికే రాజన్న క్షేత్రంపై ప్రత్యేక దృష్టి సారించారు.
ముఖ్యమంత్రి హోదాలో మూడుసార్లు వేములవాడకు వచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. రాజన్నను దర్శించుకున్నవారికల్లా పదవీగండం తప్పదనే అపవాదును ప్రచారంలోకి తెచ్చి, ఇటువైపు కన్నెత్తి చూడడమే మరిచిపోయిన నాటి నేతల కళ్లు తెరిపించారు. 2015 జూన్ 18న, డిసెంబర్ 28న, 2019 డిసెంబర్ 30న స్వామివార్లను దర్శించుకొని, క్షేత్రస్థాయిలో తిరిగారు.
ఆలయ అభివృద్ధికి బీజం వేశారు. మొదటి సారి సందర్శించినప్పుడే రాజన్న ఆలయంతోపాటు వేములవాడ పట్టణాన్ని సమగ్రాభివృద్ధి చేసేవిధంగా వేములవాడ ఆలయ ఏరియా అభివృద్ధి ప్రాధికార సంస్థ (వీటీడీఏ)ను ఏర్పాటుచేశారు. దీని ద్వారా ఇప్పటికే కోట్లాది రూపాయలను వెచ్చించి అభివృద్ధి పనులను వేగవంతం చేశారు.
పలు పనులకు నేడు మంత్రి కేటీఆర్ భూమిపూజ
మంత్రి కేటీఆర్ మంగళవారం వేములవాడలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతో కలిసి 72కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్నారు. మొదటగా ఉదయం 11గంటలకు వీటీడీఏ, టీయూఐఎఫ్డీసీ 20కోట్ల నిధులతో పట్టణంలోని రహదారులు, స్టేడియం, సినారె కళామందిరం పునర్నిర్మాణ పనులకు తెలంగాణ చౌక్‌లో భూమిపూజ చేస్తారని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి తెలిపారు. అలాగే పంచాయతీరాజ్, రోడ్లుభవనాలశాఖ ఆధ్వర్యంలో 52కోట్లతో చేపట్టే రహదారుల పునరుద్ధరణ పనులకు సంబంధించిన శిలాఫలాకాన్ని ఆవిష్కరించనున్నారు.
ఆ తర్వాత రుద్రంగి మండల కేంద్రంలో 3.50 కోట్లతో నిర్మించిన కస్తూర్బా పాఠశాల భవనాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1.30గంటలకు వేములవాడలోని మహాలింగేశ్వరగార్డెన్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు.