గొల్లపల్లి, మే 10: కాంగ్రెస్, బీజేపీ ఎన్ని మాట్లాడినా రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలోనే తెలంగాణ రూపురేఖలే మారాయని, సంక్షేమం, అభివృద్ధి జోడెడ్ల ప్రయాణం సాగుతున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రంలో పర్యటించిన కేసీఆర్ సబ్బండ వర్గాల కష్టాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా పథకాల రూపకల్పన చేస్తున్నారని చెప్పారు. రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతిగా రైతుల సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రైతుల పాలిట పెద్దన్నగా నిలుస్తున్నాడన్నారు. గొల్లపల్లి మండలంలోని తిర్మలాపూర్, రంగధామునిపల్లి గ్రామాల్లో 6కోట్లతో పూర్తి చేసిన పనులను బుధవారం ప్రారంభించడంతో పాటు మంజూరైన పలు పనులకు శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న మెజారిటీ రైతాంగం కోసం 1500కోట్లతో ఉచిత కరెంట్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రైతు ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించడంతోపాటు రైతులకు పెట్టుబడి సాయం కోసం ఏటా 12వేల కోట్లను వెచ్చిస్తున్నట్లు వివరించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలను ప్రజలెవరూ అడగలేదని, కేసీఆర్ పర్యటనలో తాను తెలుసుకున్న ప్రజల కష్టాలను తీర్చేడానికి ఈ పథకాల రూపకల్పన జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అతి తక్కువ సమయంలోనే అద్భుతమైన విజయాలను సాధించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. గత ప్రభుత్వాల పాలనలో 65ఏళ్లుగా తీరని కరెంట్ కష్టాలు రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లో సాకారమైనట్లు పేర్కొన్నారు. వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న రాష్ట్రం ఒక తెలంగాణ మాత్రమేనన్నారు. ముఖ్యమంత్రి ఒక విజన్ ఉన్న నాయకుడని, తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చాలన్న లక్ష్యం సాకారమైందన్నారు. రైతు సంక్షేమమే కాకుండా విద్య, వైద్యం కోసం ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. కేంద్రంలో బీజేపీ మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో 400లు ఉన్న సిలిండర్‌ను 1200కు పెంచిందన్నారు. పేద ప్రజలు నిత్యావసరాల ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల ఇబ్బందులు తీరాలంటే ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు పీఎం కావాలని ఆకాంక్షించారు. అనంతరం మండలంలోని అగ్గిమల్లలో జరుగుతున్న బీరయ్య పట్నాల కార్యక్రమంలో మంత్రి పాల్గొని స్వామివారికి పూజలు చేసి మొక్కు లు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచులు ఎరవేని రమేశ్, అనంతరెడ్డి, జడ్పీటీసీ జలంధర్, వైస్‌ఎంపీపీ సత్త య్య, చందోలి పీఏసీఎస్ అధ్యక్షుడు మాధవరావు, గొల్లపల్లి ప్యాక్స్ వైస్ చైర్మన్ తిరుపతి, గొల్లపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మాండ్లు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొల్లం రమేశ్, గొల్లపల్లి పట్టణాధ్యక్షుడు జలంధర్ తదితరులు పాల్గొన్నారు.