కరీంనగర్: రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ దయాగుణం చాటుకున్నారు. యాక్సిడెంట్ అయి అపస్మారక స్థితిలో ఉన్న యువకుడి ప్రాణాలు కాపాడి ప్రాణదాత అయ్యారు. ఈ ఘటన కొలిమికుంట గ్రామంలో చోటు చేసుకుంది. ధర్మారం పర్యటన ముగించుకొని మంత్రి కరీంనగర్ తిరుగు ప్రయాణం అయ్యారు.
మార్గమధ్యంలో కొలిమికుంట గ్రామానికి సమీపంలో ఓ వ్యక్తి రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ధర్మారం మండలం మేడారం గ్రామానికి చెందిన రాజు తన యాక్టివా స్కూటీ మీద వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సరైన సమయానికి మంత్రి అతడిని చూసి వెంటనే తన కాన్వాయ్‌ను ఆపి తన సొంత కాన్వాయ్‌లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి లోపలికి వెళ్లి మంత్రి స్వయంగా ఆ యువకుడికి జరుగుతున్న చికిత్స గురించి ఆరా తీశారు. అతడికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి డాక్టర్లను కోరారు.