కార్పొరేషన్, నవంబర్ 20: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేస్తే వారు ఢిల్లీ గులాంలుగా మారి ఆంధ్రా నాయకుల చెప్పుచేతల్లోనే ఉంటారని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఆయన నగరంలోని 47, 31, 50, 10వ డివిజన్లలో ప్రచారం చేశారు. ఆయా డివిజన్లలో మంత్రికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకగా… బీఆర్ఎస్ శ్రేణులు గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, తెలంగాణ రాకముందు కరీంనగర్లో రోడ్లు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయో గమనించాలన్నారు.
పదేళ్లలో కరీంనగర్ రూపురేఖలు మార్చి గొప్పగా అభివృద్ధి చేశామన్నారు. బీఆర్ఎస్ పాలనలో వేల కోట్ల నిధులు తీసుకువచ్చి నగరంలోని అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. ఈద్గాల కోసం స్థలాలు కేటాయించినట్లు చెప్పారు. హిందువుల కోసం టీటీడీ టెంపుల్, క్రైస్తవుల కోసం ప్రార్థన మందిరాలు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. గత పదేళ్లలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని మతాల ప్రజలు కలిసి జీవించే విధంగా కరీంనగర్‌ను కాపాడుతామన్నారు. పదేళ్లలో ఎక్కడ మతఘర్షణలకు తావు లేకుండా శాంత్రి భద్రతలకు విఘాతం కలుగకుండా పని చేశామన్నారు. ఎన్నికల వేళ తెలంగాణను ఆంధ్రా వాళ్లు ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌లు ఆంధ్రా తొత్తులు అవుతారని విమర్శించారు.
నగరంలో కొనసాగుతున్న ఈ అభివృద్ధి మరింత ముందుకు సాగాలంటే కేసీఆర్‌ను గెలిపించుకోవాలన్నారు. బీజేపీ రాష్ట్రంలో ఎక్కడా గెలిచేది లేదన్నారు. అలాంటి పార్టీకి ఓటు వేసి వృథా చేసుకోవద్దని సూచించారు. అసమర్థ ఎంపీ ఉండడం వల్ల కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాలేకపోయారని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇద్దరూ ఒకటేనని విమర్శించారు. బండిసంజయ్ కాంగ్రెస్ టికెట్ ఇప్పించారని ఆరోపించారు. వారిద్దరూ ఒక్కటై మైనార్టీల ఓట్లను చీల్చాలని చూస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల కుట్రలను తిప్పి కొట్టే విధంగా మైనార్టీలంతా కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. నగరంలో ప్రశాంత వాతావరణం ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెచ్చకున్న తెలంగాణ దొంగల పాలు కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలో చేపడుతున్న మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేస్తానన్నారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే కరీంనగర్ గొప్ప నగరంగా రూపుదిద్దుకుంటుందన్నారు. కాంగ్రెస్, బీజేపీలను గెలిపిస్తే నగరంలో ప్రస్తుతం సాగుతున్న అభివృద్ధి నిలిచిపోతుందని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో మేయర్ సునీల్‌రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు షర్ఫొద్దీన్, లెక్కల స్వప్న-వేణు, అంజయ్య, నాయకులు బాబ్జానీ, నలువాల రవీందర్, శ్రీకాంత్, శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ షమీ, ఎంఐఎం నాయకుడు గులాం అహ్మద్, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.