కరీంనగర్ రూరల్: మే 2: ధాన్యం కొనుగోళ్లపై తనకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నల వర్షం కురిపించారు. వారు సమాధానాలు చెప్పకుండా తెల్లముఖం వేశారు. ఈ సంఘటన మంగళవారం కరీంనగర్ మండలం దుర్శేడులో జరిగింది. కాంగ్రెస్ నాయకులు రోహిత్ రావు, పద్మాకర్‌రెడ్డి, మొయినొద్దీన్, సాయిని తిరుపతి, రాంరెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పుకుని నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. వారిని చూసిన మంత్రి గంగుల దగ్గరికి రమ్మని పిలిచారు. ‘అన్నా.. ఎఫ్ఏక్యూ అంటే ఏంటిదే’ అని ప్రశ్నించారు. వారంతా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మాకు తెలియదని అందులో ఒకరు చెప్పారు. దీంతో ‘ఎఫ్ఏక్యూ అంటే ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ’ అని మంత్రి గంగులనే చెప్పారు. ఇది రాష్ట్రం నిర్ణయించేది కాదని, కేంద్రం నిర్ణయించేది అన్నారు. ‘తేమ శాతం ఎంత ఉంటే ధాన్యం కొనుగోలు చేస్తార’ని మంత్రి మరో ప్రశ్న సంధించారు. 15 శాతమని ఒక కాంగ్రెస్ నాయకుడు చెప్పగానే ‘కాదన్నా 17 శాతం ఉండాలి. ఇది కూడా కేంద్రం ఆధీనంలోని ఎఫ్‌సీఐ నిర్ణయిస్తుంది’ అని మంత్రి చెప్పారు.
‘పోయిన యాసంగిలో ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొన్నాం, ఈ యాసంగిలో ఎంత ధాన్యం కొన్నామో గిదైనా చెప్పండి’ అని మళ్లీ మంత్రి ప్రశ్నించారు. దీంతో ఒక నాయకుడు ఎంఎస్పీ 2,060 ఉందని చెప్పబోయాడు. కాదు ఎంత ధాన్యం కొన్నామని మళ్లీ మంత్రి ప్రశ్నించారు. 60 లక్షల మెట్రిక్ టన్నులని మరో కాంగ్రెస్ నాయకుడు చెప్పారు. కాదు జిల్లాలో అని మళ్లీ మంత్రి అడిగారు. 2 లక్షలని సదరు కాంగ్రెస్ నాయకుడు మళ్లీ సమాధానం చెప్పబోయారు. అన్నా మీకు దండం పెడ్తనే.. అంటూ పోయిన యాసంగిలో మే 2 వరకు ఎంత కొ న్నం అని మళ్లీ మంత్రి అడిగారు. 75 వేల క్వింటాళ్లు అని అదే కాంగ్రెస్ నాయకుడు చెప్పడంతో అక్కడున్న వారు నవ్వుకున్నారు. ‘కాదు.. గత యాసంగిలో మే 2 వరకు కేవలం 7,500 మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నాం. కానీ, ఈ సారి ఇప్పటికే 22 వేల మెట్రిక్ టన్ను లు కొన్నాం అంటే ఎంత ఎక్కువ కొన్నామో అర్థం చేసుకోండి’ అని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు మంత్రి గంగుల.
ఈ సందర్భంగా మంత్రి గంగుల వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక మంత్రిని కలిచేందుకు వచ్చినపుడు అన్ని తెలుసుకుని రావాలని, మంత్రిని గట్టిగా నిలదీయాలని, ఏమీ తెలుసుకోకుండా వచ్చి అడిగితే ఎట్లని ఎదురు ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం మీవద్ద ఉన్నదా..?, లేకుంట ఎట్ల వచ్చి ప్రశ్నిస్తరే అని నిలదీశారు. అనంతరం స్థానిక ధాన్యం కొనుగోలు కేంద్రంలో వరిని పరిశీలించి రైతులతో మాట్లాడి వెనుదిరుగుతుండగా ‘జైజై తెలంగాణ.. జై గంగుల.. జైజై బీఆర్ఎస్’ అంటూ బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు.
అనంతరం కాంగ్రెస్ నాయకులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ, రైతుల సమస్య కోసం వచ్చి, మంత్రిని ప్రశ్నిస్తే ఆయన అనుచరులు, తెలివి లేకుండా నినాదాలు చేశారని అనడంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, నేరెళ్ల శ్రీనివాస్, వెంకట్, ఆకుల కిరణ్ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించేందుకు వెళ్లారు. దీంతో కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ నాయకులు మంత్రి కాన్వాయ్కి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో బీఎస్ఆర్ నేతలు ప్రతి ఘటించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు మధ్య వాగ్వివాదం జరిగింది. ఇరు వర్గాలు ఒకరిని ఒకరు తోసుకున్నారు. మంత్రి గంగుల కలుగజేసుకుని బీఆర్ఎస్ నాయకులకు సర్ధిచెప్పారు. పోలీసులు జోక్యం చేసుకుని కాంగ్రెస్ నాయకులకు సముదాయించడంతో గొడవ సద్దు మణిగింది. మొత్తానికి కొనుగోళ్లపై ఎలాంటి సమాచారం లేకుండా తన వద్దకు వచ్చిన కాంగ్రెస్ నాయకులకు మంత్రి గంగుల కళ్లు తెరిపించినట్లయ్యింది.