ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అద్భుతమైన సేవలు అందుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం నాడు స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఆయన పండ్లు, స్వీట్లు పంచారు. ఆ సమయంలో ఆయనతోపాటు నగర మేయర్, జడ్పీ చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్ కూడా ఉన్నారు. వీరంతా కలిసి రోగులకు, బాలింతలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు.
వార్డుల్లో కలియతిరిగి అందుతున్న వైద్య సేవలపై బాలింతలను అడిగి తెలుసుకున్నరు. ప్రభుత్వ ఆసుపత్రులకు పెద్ద ఎత్తున వస్తున్న పేషెంట్లకు అందిస్తున్న సేవలపై డాక్టర్లతో మాట్లాడి తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు. రజిని అనే మహిళకు ఒకే కాన్పులో ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు కవల పిల్లలు జన్మించడంతో వారికి రెండు సీఎం కేసీఆర్ కిట్లతో పాటు 5000 రూపాయలను బహుమతిగా అందించారు.
సీఎం కేసీఆర్ పిలుపుమేరకు కరీంనగర్ జిల్లాలో వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పలువురు బాలింతలకు కేసీఆర్ కిట్లను అందజేశారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని వైద్య సేవల పట్ల ఇక్కడి బాలింతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రైవేటుకు దీటుగా కరీంనగర్లోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో అద్భుతమైన వైద్య సేవల ఉండటంతో ప్రతిరోజు 250 నుండి 300 మంది గర్భిణీ స్త్రీలు చికిత్స కోసం వస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, డాక్టర్ ఆలీమ్ తదితరులు పాల్గొన్నారు.